TG Assembly | కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ తప్పులను ఎత్తిచూపితే తట్టుకోలేమని కాంగ్రెస్ సర్కార్‌కు జ్వరం పట్టుకున్నదా? జల విధానంపై చర్చ అంటే బీఆర్ఎస్కు ఆయుధం ఇచ్చినట్టేనని జంకుతున్నదా? గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో బీఆర్ఎస్ ఎదురుదాడిని తట్టుకోలేమని వణికి పోతున్నదా? అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండా చేసేందుకు జవవరిలో పెడుతామన్న అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరుపుతున్నదా? అంటే ‘అవును’ అనే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు! ఇన్ని రోజులు ఆడింది ఆటగా.. పాడింది పాటగా నెట్టుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు.. బీఆర్ఎస్ అధినేత సింహగర్జనతో బెదిరిపోయినట్టు తెలుస్తున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గోదావరి, కృష్ణా జలాలపై హక్కులను పక్కరాష్ర్టానికి ధారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఆదివారం మీడియా సాక్షిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చీల్చిచెండాడటంతో పాలక పెద్దల వెన్నులో వణుకు మొదలైనట్టు సమాచారం. రెండేండ్లపాటు సమయం ఇచ్చి ఇక తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి సర్కారుపై కన్నెర్రజేయడంతో అధికారపక్షంలో చలిజ్వరం పుట్టినట్టయింది. ఇక ఆయన ఏకంగా అసెంబ్లీకి వస్తే తమను చెడుగుడాడుకోవడం ఖాయమన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నదని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి.
‘జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తం.. కేసీఆర్.. అసెంబ్లీకి రా’ అంటూ బీరాలు పలికి మేకపోతు గాంభీర్యాన్ని చూపిన సీఎం రేవంత్‌రెడ్డి.. 24 గంటలు గడవక ముందే ‘తీరా ఆయన వస్తే తట్టుకోవడం కష్టం’ అని ఏకంగా సభలో గవర్నర్ ప్రసంగాన్నే తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు శీతాకాలపు సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగాన్ని తప్పించాలని మంత్రులకు సూచించినట్టు సమాచారం. ఆయన సూచనలో భాగంగానే ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ‘గవర్నర్ ప్రసంగించాల్సి వస్తే సభలో చర్చించాల్సిన అంశాలను ప్రసంగంలో చేర్చాల్సి ఉంటుంది. జల విధానంపై చాలెంజ్ చేసినం కాబట్టి ఆ అంశాన్ని చేర్చితే బీఆర్ఎస్ను ఎదుర్కోవడం కష్టం.. చేర్చకపోతే ఆ విధానం గురించి మాట్లాడలేం..
కాబట్టి ఎటు చూసినా ఇబ్బందులే ఉన్నవి కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని తప్పించాలి’ అని ఎత్తుగడ వేసినట్టు కాంగ్రెస్ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. కొత్త సంవత్సరంలో సభ పెట్టినా.. బడ్జెట్ సమావేశాలు నిర్వహించినా గవర్నర్ ప్రసంగం తప్పని సరి. రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకోవడానికీ చేసిన గొప్ప పనులు ఏమీ లేవు.. గవర్నర్ ప్రసంగంలో చెప్పుకోడానికీ చేసిన పనులు సరిపోవు. అలాంటిది రెండో సారి సభలో చెప్పుకోడానికీ ఏదీ లేకపోవడం నామోషీ అని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు ముందుగా కొత్త సంవత్సరంలో ప్రారంభిస్తామన్న అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరిపి ఈ నెలలోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పాత సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తే గవర్నర్ ప్రసంగం అవసరం ఉండదని, ధన్యవాద తీర్మానానికి అవకాశం ఉండదు కాబట్టి బీఆర్ఎస్ను మాట్లాడనీయకుండా చేయవచ్చని కుయుక్తులు పన్నినట్టు సమాచారం.
బుక్కయిపోతామని.. అప్రమత్తం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి జల విధానపరమైన అంశాలపై వాడి తగ్గకుండా మాట్లాడి కాంగ్రెస్ తీరును ఎండగట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తమైనట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటే అడ్డంగా బుక్కయితామని మంత్రులతో అన్నట్టు సమాచారం. సోమవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగం, మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరికలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. గవర్నర్ ప్రసంగంలో కృష్ణా, గోదావరి జలాల అంశాలే ప్రధానంగా ఉంటాయని, ఈ అంశాలు ఉంటే బీఆర్ఎస్కు ఆయుధం ఇచ్చినట్టేని మంత్రులతో సీఎం అన్నట్టు తెలిసింది. ‘సమావేశం తొలిరోజే వారు మానసికంగా మన మీద పైచేయి సాధిస్తే.. సమావేశాలు ముగిసేంత వరకు అదే దాడి కొనసాగిస్తరు’ అని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ భయం నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని తప్పించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి శీతాకాల సమావేశాలను కొత్త ఏడాది జనవరి 2 నుంచి ప్రారంభించి, ఎక్కువ రోజులు కొనసాగించకుండా 3 నుంచి 5 రోజుల్లోనే ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. కానీ జల హక్కుల కాలరాతపై కేసీఆర్ గళమెత్తడంతో కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైనట్టు సమాచారం.
కొత్త సంవత్సరం అయితే గవర్నర్ ప్రసంగం తప్పనిసరి!
రాజ్యాంగ నియమం ప్రకారం కొత్త సంవత్సరంలో ప్రారంభమయ్యే మొదటి సమావేశాల్లో కచ్చితంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి. లేదా బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునైనా ప్రసంగించాలి. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తే.. గవర్నర్ ప్రసంగం ఉండాలి కాబట్టి, ఈ ప్రసంగాన్ని తప్పించడం కోసం సభలను డిసెంబర్ 29 నుంచే ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. డిసెంబర్ 29 నుంచి పాత సంవత్సరంలోనే సమావేశాలు మొదలవుతాయి కాబట్టి, అవే కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతాయి. అప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం పెట్టాల్సిన అవసరం లేదన్న చర్చ వచ్చినట్టు తెలిసింది. 2025, డిసెంబర్ 29న సమావేశాలు ప్రారంభించి, 2026 జనవరి 1 వరకు వాయిదా వేయాలని, తిరిగి 2 నుంచి పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. సమావేశాల్లో ఒక రోజు కృష్ణా జలాలు, మరో రోజు గోదావరి జలాల మీద, ఇంకో రోజు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మీద చర్చ పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ గోదావరి, కృష్ణా జలాల మీదనే చర్చకు పట్టుబడుతుందని, ప్రిపేరై రాకుంటే అభాసుపాలవుతామని మంత్రులతో సీఎం అన్నట్టు సమాచారం. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా.. మిగిలిన మంత్రులు సందర్భానికి తగ్గుట్టుగా బీఆర్ఎస్పై ఎదురు దాడి చేయాలని సూచించినట్టు తెలిసింది.
మంత్రులకు ర్యాంకులు
జీహెచ్ఎంసీ వార్డుల విభజన, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన జిల్లా ఇన్చార్జి మంత్రులకు సీఎం ర్యాంకులిచ్చినట్టు సమాచారం. ఈ ర్యాంకుల కేటాయింపులో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, సీతక్క, పొన్నం ప్రభాకర్ తదితరులు వెనుకబడ్డట్టు తెలిసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే ప్రాదేశిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు రాని నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో అవసరం లేదని మంత్రులకు సీఎం సూచినట్టు తెలిసింది. ప్రభుత్వపరమైన రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు కాబట్టి, ఈ గ్యాప్‌లో పార్టీపరమైన రిజర్వేషన్లు అనే ప్రతిపాదనను విస్తృత చర్చలోకి తీసుకురావాలని చెప్పినట్టు సమాచారం. రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి అసెంబ్లీలో పెట్టి, అన్ని పార్టీల నాయకుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది.