హైదరాబాద్ : శాసనసభ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈనెల 27 వరకు బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా స్పీకర్ ఆయనపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయినా సోమవారం జగదీశ్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. అయితే సభ లోపలికి వెళ్లకుండా చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. తన సస్పెన్షన్‌పై ఇంతవరకు ఎలాంటి బులెటిన్ ఇవ్వలేదని, అలాంటప్పుడు సస్పెండ్ చేశారనడానికి ఆధారాలు ఏమున్నాయని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను ఏ కారణంతో సస్పెండ్ చేశారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. సస్పెండ్ చేశారో లేదో కనీసం ఆధారాలు లేవు. బులెటిన్ ఇస్తే నేను రాను. లేదంటే సభాపతిని కలుస్తా. నేను కోర్టుకు వెళ్తానన్న భయంతో బులెటిన్ ఇవ్వట్లేదు. ఎలాంటి రాజ్యాంగ విలువలు, నిబంధనలు పాటించకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట. మంత్రులు జవాబివ్వలేక ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు.’ అని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు.
నల్లగొండ జిల్లా మంత్రులు దావత్‌లకు కూడా ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళ్తున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఒక గంట ప్రయాణానికి కూడా హెలికాప్టర్లో వెళ్తున్నారని అన్నారు. నిన్న జాన్పాడ్లో దావత్‌కు కూడా జానారెడ్డి హెలికాప్టర్లో వచ్చారని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్వశ్చన్ అవర్ రద్దు చేస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై శాసనసభలో లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు లేదని ఆరోపించారు.
పవర్ ప్లాంట్‌లో రాత్రి 10.15 గంటలకు ప్రమాదం జరిగితే.. తానే ముందు చేరుకున్నానని చెప్పారు. తాము
చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంతోపాటు వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించామని అన్నారు. ఈ ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వలన చనిపోయిన వారి కుటుంబాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు.