ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే అత్యున్నత వేదిక అసెంబ్లీ. ప్రజాస్వామ్య దేవాలయం అది. తమ సమస్యలకు విముక్తి లభిస్తుందేమోనని కోట్లాదిమంది ఆశగా, ఆసక్తిగా ఎదురు చూసే ఈ వేదిక.. అధికార పక్షం వ్యవహరించిన తీరుతో చిన్నబోయింది. చర్చలను పక్కనపెట్టి.. పక్కదోవ పట్టించి విపక్షాలపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాలక పెద్దలు.. ప్రజా సమస్యల ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు.
అబద్ధాలను అలవోకగా వల్లెవేసిన ప్రతిసారీ అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగారు. విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. తమది ప్రజా పాలన అని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల ఊసెత్తదు. గ్యారెంటీలను గ్యారెంటీగా ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పదు. ప్రతిపక్షాలు సమస్యలు లేవనెత్తిన ప్రతిసారీ సభలోకి సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి నానాయాగీ చేయడం. విజయవంతంగా దానిని పక్కదారి పట్టించి జవాబు చెప్పకుండా బయటపడి ఊపిరి పీల్చుకోవడం.. అసెంబ్లీ జరిగినన్నాళ్లూ ప్రభుతానిది ఇదే తీరు.
అధికార పక్షం మూకుమ్మడి దాడిని ఎదుర్కొంటూనే బీఆర్ఎస్ సభ్యులు ప్రజా సమస్యలపై గళమెత్తారు. అరెస్టులు చేసినా, మార్షల్స్ ఎత్తి పడేసినా తమది ప్రజాపక్షమేనని నిరూపించారు. ప్రభుత్వ తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వినిపించినా ‘నవ్విపోదురు గాక..’ రీతిలో వ్యవహరించడం చూసి ప్రజాస్వామ్య వాదులు సైతం విస్తుపోయారు.
Assembly Session | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణ పూర్తిస్థాయి శాసనసభ సమావేశాలు వ్యక్తిగత దూషణలు, దారిమళ్లింపు రాజకీయాలకు వేదికయ్యాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గత నెల 24 నుంచి శుక్రవారం వరకు 9 రోజులపాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ సర్కార్ సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా వారిపట్ల అమర్యాదగా వ్యవహరించిందని రాజకీయ విశ్లేషకుల నుంచి అభ్యంతరాలు వ్యవక్తమవుతున్నాయి. దాదాపు పదేండ్లపాటు సభానాయకుడిగా కేసీఆర్ ప్రదర్శించిన హూందాతనం, వివిధ పార్టీల ఎమ్మెల్యేల సూచనలను స్వీకరించి తీరు, ఆయా సమయాల్లో విపక్ష ఎమ్మెల్యేలనూ కీర్తించిన సందర్భాలను గుర్తుచేస్తున్నారు.
తాజాగా జరిగిన సమావేశాల్లో సభానాయకుడిగా సీఎం రేవంత్‌రెడ్డి సభ్యుల మనోభావాలను, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లు, వివిధ పద్దులపై జరిగిన చర్చల సందర్భంగా సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సింది పోయి మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. ‘ఆ అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండే’, ‘మీరే స్వయంగా వచ్చి చెప్పుతో కొడతారు’ అంటూ రేవంత్‌రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలను ఉంటంకిస్తూ తప్పుపడుతున్నారు.
బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ సర్కార్ వద్ద సరైన సమాధానాలు లేకనే సీఎం రేవంత్‌రెడ్డి సహా డిప్యూటీ సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుర్భాషల పర్వానికి దిగారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే వ్యక్తిగత విమర్శలకు దిగారని పేర్కొంటున్నారు. బడ్జెట్ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు, పద్దులపై చర్చ సందర్భంగా మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అడిగిన అంశాలపై సమాధానం చెప్పకుండా ఉద్దేశపూర్వకంగానే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌రాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, దానం నాగేందర్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రేవంత్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. సభానాయకుడిగా రేవంత్‌రెడ్డి తగడని, ఆయనో అన్‌ఫిట్ సీఎం అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘సీనియర్ శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పెద్దమనిషి తరహా వ్యవహరించకుండా మరింత అభ్యంతరకమైన భాషను ప్రయోగించారు’ అని విమర్శించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించి సభను అగౌరవ పరిచారన్న బీఆర్ఎస్ విమర్శలతో ఎంఐఎం నేత, సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఏకీభవించారు. సభలో సర్కార్ అనుసరించిన తీరును అక్బరుద్దీన్ ఆక్షేపించారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచీ సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే సభను తప్పుదారి పటిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది.
పద్దులపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ‘వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు పెడుతామని బీఆర్ఎస్ ప్రభుత్వమే సంతకకాలు చేసింది’ అని అనడంతో సభలో దుమారం చెలరేగింది. సీఎం ఉద్దేశపూర్వకంగానే ‘అదర్ద్యాన్ అగ్రికల్చర్ కనెక్షన్స్’ అనే వాక్యాన్ని వదిలేసి చదివారు’ అని అసలు విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టింది.
కాళేశ్వరం విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన సూచనను గత ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని సీఎం చేసిన వ్యాఖ్యలు సభను తప్పుదారి పట్టించాయని బీఆర్ఎస్ అసలు విషయాన్ని బయటపెట్టింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుందాతనంతో వ్యవహరించారని, అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి భేషజాలకు పోయారని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలే వాపోతున్నారు. కేటీఆర్ ప్రసంగంలో రేవంత్ అని ఒక దశలో సంభోదించగా దీనిపై కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టారు. ఒక దశలో స్పీకర్ సైతం సభానాయకుడిని ఏకవచనంతో సంభోదించకూడదని చెప్పడంతో కేటీఆర్ గతంలో తనకున్న చనువుతో అలా అన్నానని, ఒకవేళ తన మాటలు సరికాదని భావిస్తే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తుచేస్తూనే మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై పెదవి విరుస్తున్నారు. సభానాయకుడిగా సీఎం హూందాగా వ్యవహరించాల్సిందిపోయి వివాదాలకు కారణమవుతున్నారని కాంగ్రెస సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి సభలో వ్యవహిరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి నీళ్లు ఎత్తుకుపోయినప్పుడు పదవుల కోసం పెదవులు మూసుకున్నది బీఆర్ఎస్ నాయకులేనని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలతో తూర్పారబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ఆడబిడ్డలకు రక్షణ కరువైందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సభలో మంగళవారం ప్రస్తావిస్తే బుధవారం ‘మీ వెనకాల ఉన్న ఇద్దరు అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలిండ్లు. ఆ అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్స్టేషనే దిక్కవుద్ది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అంటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘కాంగ్రెస్ పార్టీ దళితుడిని సీఎల్పీ నేతను చేస్తే పార్టీ మారిన మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు’ అంటూ సబితా ఇంద్రారెడ్డిని సీఎంతో పోటీపడి మరీ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై చేసిన వ్యాఖ్యలకు సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని గురువారం జరిగిన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పోడియం ముందు నిలబడి ఏకధాటిగా నిరసన తెలుపుతున్న తరుణంలో సీఎం మరోసారి మాట మార్చి ‘ఆ ఇద్దరు అక్కలు అక్కడ (బీఆర్ఎస్లో) ఉంటే లాభం లేదు. ఇటు ఉంటే మేం (మంత్రులు సీతక్క, కొండా సురేఖను చూపిస్తూ) గౌరవంగా చూసుకుంటాం. సొంత చెల్లె (ఎమ్మెల్సీ కవిత) జైలుకు వెళ్లినా ఇక్కడ రాజకీయాలు చేస్తుండు (కేటీఆర్‌ను ఉద్దేశించి) అంటూ వ్యాఖ్యానించారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు హామీ ఇచ్చిందని, సభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చె ప్పి కేవలం ప్రకటన మాత్రమే చేయటం ఏమిటని శుక్రవారం జరిగిన సభలో బీఆర్ఎస్ తప్పుబట్టింది. జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరగాలని పట్టుబట్టింది. బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ‘ఏయ్.. నీ యమ్మా… తోలు తీస్తా కొడకా..బయట తిరగనీయం’ అంటూ దబాయించి దుర్భాషలాడటం, అసలు జాబ్‌క్యాలెండర్‌పై చర్చ అవసరమే లేదని సభలో స్టేట్మెంట్ చదివేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయటికి వెళ్లిపోవటంతో చేసేదేంలేక బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చి గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు.
సభలో సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై సీఎం, డిప్యూటీ సీఎం తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. వారికి మీడియా పా యిం ట్ వద్ద మాట్లాడే అవకాశం కూడా లేకుండా కాంగ్రెస్ వ్యవహరించిందనే ఆరోపణలు వచ్చాయి.
సభలో ముగ్గురు మహిళా సభ్యులు నాలుగున్నర గంటలపాటు నిలబడి నిరసన తెలుపుతున్నా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు స్పందించని రికార్డును తెలంగాణ అసెంబ్లీయే నమోదు చేసి ఉంటుందని సీనియర్ పాత్రికేయుడొకరు వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరును గతంలో రాజస్థాన్, ఒడిశా సహా పలు రాష్ర్టాలు అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. కామన్వెల్త్ పార్లమెంటేరియన్ సదస్సుల్లోనూ తెలంగాణ అసెంబ్లీపై ప్రశంసలు వచ్చిన సందర్భాలున్నాయని, అలాంటి సభ ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల తొడగొట్టడాలు, దుర్భాషల ఉదంతాలతో మసకబారిందని విశ్లేషించారు.
సభానాయకుడిగా రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకుల పట్ల కేసీఆర్ ప్రదర్శించిన హుందాతనపు సందర్భాలను అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిరోజూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కాకుండా కాంగ్రెస్, ఎంఐఎం సభ్యు లు కూడా గుర్తుచేసుకున్నారు. ఆయన ఏనాడూ ప్రతిపక్ష నేతలను చులకనగా చూడలేదనీ చెప్పుకొంటున్నారు. ‘ఎల్వోపీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేసీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ‘పెద్దలు జానారెడ్డిగారు’ అంటూ సం బోధించేవారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఏనాడూ తూలనాడలేదు. ఒక్క పరుష పదం కూడా ఆయన గురించి మాట్లాడలేదు. ఇక బీజేపీ ఎల్పీ నేతగా ఉన్న లక్ష్మణ్‌ను గౌరవప్రదంగా విద్యాధికుడు అని కేసీఆర్ స్వయంగా ప్రస్తుతించారు. సభలో వాతావరణం వేడెక్కిన ప్రతిసారీ కేసీఆర్ ఇంటిపెద్దగా వ్యవహరించేవారు’ అని గుర్తుచేస్తున్నారు. ఇందుకు గతంలో డీకే అరుణ, కేటీఆర్ మధ్య జరిగిన ఘటనను ఉదహరించారు. వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినప్పుడు కేసీఆర్ జోక్యం చేసుకొని, ఓ మెట్టు దిగి తన సభ్యుడితో క్షమాపణ చెప్పించారని గుర్తుచేశారు. కేసీఆర్ తనపై వచ్చిన విమర్శలను కూడా హుం దాగా స్వీకరించేవారని చెప్తున్నారు.
ఓ సందర్భంలో నాటి బీజే పీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘కరీంనగర్‌ను లండన్ చేస్తానని అన్నారు’ అని ప్రశ్నించగా ‘మీరు చదువుకున్న యువనేత. ఇలా తప్పుడు అన్వయం చెప్పడం సరికాదు’ అని చెబుతూనే తాను ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్య లు చేశానో వివరించారని చెప్పారు. సభ్యులు ఏవైనా సమస్యలను ప్రస్తావిస్తే వాటిని నోట్ చేసుకోవడంతోపాటు పరిశీలించాలంటూ సంబంధిత మంత్రికి, అధికారులకు అక్కడికక్కడే సూచనలు జారీ చేసేవారని, నాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్న భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ ఇలా ఎవరు సమస్యలను ప్రస్తావించినా పరిష్కారానికి వెంటనే ఆదేశాలిచ్చేవారని చెబుతున్నారు.
108 ఉచిత అంబులెన్స్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను పొగిడి, వాటిని మరింత మెరుగ్గా అమలు చేశారని, సభలో స భ్యులకు గౌరవం ఇవ్వడమే కాకుండా శాసన సభ్యుల పట్ల బయటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించేవారని, పెద్దన్న పాత్ర పోషించారని చెప్తున్నారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ సభ్యులనుద్దేశించి కొన్ని టీవీ చానళ్లు అవహేళన చేయగా, అసెంబ్లీ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతిని గుర్తుచేస్తున్నా రు. పక్కన ఏపీ అసెంబ్లీ అరుపులు, గొడవలు, దూషణలతో దద్దరిల్లుతూ మీసాలు తిప్పడం తొడలు చరచడం వంటి విన్యాసాలు జరిగేవి. ‘పక్కన తెలంగాణ అసెంబ్లీని చూడండి’ అని అదే సభలో స భ్యులు నాటి ఏపీ ప్రభుత్వానికి గడ్డిపెట్టిన సందర్భాలున్నాయి. సభా నాయకుడిగా కే సీఆర్ ప్రదర్శించిన తీరుకు ఉదహరణలు ఇలా..
తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు, దీక్షలు, లాఠీ దెబ్బలు, కష్టాలు పడ్డ తర్వాత మనకు సాకారమైంది. సంయమనంతో హృదయపూర్వక విధానంతో అందరం కలసి మనం తెలంగాణను నిర్మించుకోవాలి. మేము ఒకరమే చేస్తామని ఒంటెద్దు పోకడ పోదలచుకోలేదు. ఏ పాలసీని రూపకల్పన చేసినా ఖచ్చితంగా అన్ని పార్టీలను పిలిచి కూర్చుని మాట్లాడి చేస్తాం.
– 2014, జూన్ 10న తొలిసభలో కేసీఆర్
మహిళల గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది. వారికి సమాజంలో రక్షణ ఉండాలి. మహిళల ఆత్మగౌరవం పెరిగే విధంగా నడుచుకోవాల్సిన బాధ్య అందరిపైనా ఉన్నది.
-శాసనసభలో 2014, జూన్ 13న కేసీఆర్
జానారెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతమాత్రమే.. వయసు రీత్యా, అనుభవం రీత్యా ఆయన అందరికీ గౌరవనీయులు. సభలో ప్రతిపక్ష నేతకు సముచిత ప్రాధాన్యం ఉంటుంది. జానారెడ్డికి ప్రాధాన్యత విషయంలో చర్యలు తీసుకుంటాం.
-2014, నవంబర్ 10న కేసీఆర్
సన్నబియ్యం సలహా ఆనాడు ఈటల రాజేందర్ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్స్ పర్ ఆల్ కమ్యూనిటీస్. దీనికి పేరు కూడా మా ఈటల రాజేందరే పెట్టారు. డైట్ చార్జీలు రాజేందర్ కోరిక మేరకు పెంచుతున్నాం. రాజేందర్ చెప్పా రు కాబట్టి చేయం అని అనొద్దు. కావాలంటే ఆయనకు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలి. రాజేందర్ ఇవ్వాళ ఇకడి (బీఆర్ఎస్) నుంచి అకడికి (బీజేపీ) వెళ్లొచ్చు కానీ అన్నీ తెలుసు.
-2023, ఫిబ్రవరి 23న కేసీఆర్