Assembly Elections | హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకున్నది. 48 గంటలు మాత్రమే ఇక మిగిలి ఉన్నది. గురువారం మంచి రోజు కావడం, శుక్రవారం చివరి రోజు కావడం అభ్యర్థులు దాదాపు గురువారం నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. నామినేషన్ల దాఖలు, ప్రచారంలోనూ ‘కారు’ టాప్ గేర్‌లో దూసుకుపోతున్నది. కాంగ్రెస్, బీజేపీ మాత్రం చాలా వెనుకబడ్డాయి. 11 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులనే తేల్చకుండా ఆపసోపాలు పడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 119 స్థానాల్లో అభ్యర్థులను ఎప్పుడో ప్రకటించేశారు. అప్పటి నుంచే అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికే ఒకటిరెండుసార్లు నియోజకవర్గం మొత్తం చుట్టివచ్చారు. ఏ వాడలో చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. షెడ్యూల్ విడుదలకాగానే దాదాపు అభ్యర్థులందరికీ సీఎం కేసీఆర్ స్వయంగా బీ ఫారాలు అందజేసి, ఆశీర్వదించారు. కొందరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీ ఫారాలు అందజేశారు. నామినేషన్ల ఘట్టం మొదలుకాగానే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల జయజయ ధ్వానాల మధ్య భారీ ర్యాలీగా వెళ్తూ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తున్నది. గురువారం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కుమ్ములాటల్లో ప్రతిపక్షాలు
48 గంటల్లో నామినేషన్ల ఘట్టం ముగియనుండగా, ప్రతిపక్ష పార్టీలు ఇంకా టిక్కెట్ల కేటాయింపులు పూర్తి చేయలేదు. ఇప్పటికీ బీజేపీ 11 స్థానాలకు, కాంగ్రెస్ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది. ఆయా చోట్ల అసలు పోటాచేస్తారా? లేదా? అని పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటిస్తే.. వారు ఎప్పుడు నామినేషన్లు సిద్ధం చేసుకుంటారు? ఎప్పుడు ప్రచారం మొదలు పెడతారు? అని నాయకులను నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల ‘టికెట్ మీకే’ అంటూ ఇద్దరు, ముగ్గురికి ఆశచూపడంతో ఒకే పార్టీ నుంచి డబుల్ నామినేషన్లు దాఖలవుతున్నాయి. నర్సాపూర్‌లో బుధవారం ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్‌కుమార్ నామినేషన్ వేశారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అని చెప్పుకొనే కాంగ్రెస్ ఇంకా ఇలాంటి చిల్లర పంచాయితీలను తీర్చడంలోనే తలమునకలై ఉన్నది. బీఆర్ఎస్ మాత్రం నామినేషన్ల సమర్పణ, ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నది.