వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 9ః అభివృద్ధి అంటే తెలంగాణలో మాదిరిగా జరగాలని అస్సాం రాష్ట్ర ప్రజాప్రతినిధులు కొనియాడారు. చాలా పట్టుదలతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ లాంటి వారు దేశానికి అవసరమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, వాటి పనితీరుపై హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీలో వారం రోజులుగా నిర్వహించిన శిక్షణ తరగతులకు అస్సాం ప్రతినిధులు హాజరయ్యారు. శిక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
టీ-హబ్తో పాటు పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, హరితహారంలో పెంచిన మొక్కలు, డబుల్బెడ్రూం ఇండ్లు, చారిత్రక ప్రదేశాలు, మాడల్ గ్రామాలను సందర్శించారు. షాద్నగర్, కడ్తాల్ తదితర ప్రాంతాల్లో రైతులతో మాట్లాడారు. శుక్రవారం శిక్షణ ముగింపు కార్యక్రమంలో పలువురు అస్సాం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి నేత ఉంటే ఏ రాష్ట్రమైనా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని అ న్నారు. నాడు ఎడారిగా ఉన్న ప్రాంతాల్లో నూ భూగర్భ జలాలు పెరగడం, పచ్చదనం వంటి అద్భుతాలను చూశామని ప్రశంసించారు. తెలంగాణ తరహా పథకాలను అస్సాంలోనూ అమలు చేయాలని తమ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.
గ్రామాల్లో కేసీఆర్ క్రేజీ
తెలంగాణలోని పల్లెలు పచ్చగా ఉన్నాయి. వృత్తుల వారు, వృద్ధులు చాలా ఆనందంగా ఉన్నారు. మేము పలు గ్రామాల్లో 10 మందిని కలిస్తే.. అందులో 9 మంది సీఎం కేసీఆర్ను పొగుడుతున్నారు. ఇలాంటి పట్టుదల గల ముఖ్యమంత్రి ఉంటే ఏ రాష్ట్రమైనా త్వరగా అభివృద్ధి చెందుతుంది.
– భానుప్రియ, ఎంపీపీ, నల్సారీ, అస్సాం
కేసీఆర్ ఇక్కడి ప్రజల అదృష్టం
సీఎం కేసీఆర్ పట్టుదల ఎలాంటిదో ఈ ప్రాంత అభివృద్ధిని చూస్తే తెలిసి పోతున్నది. ఇతర రంగాల కన్నా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం తెలంగాణ ప్రజల అదృష్టం. ఇలాంటి పట్టుదల గల నేత దేశానికి అవసరం. కేసీఆర్ దేశ నేత అయితే అందరికీఉపాధి లభిస్తుంది.
– బుద్దా పాత్గిరి, ఎంపీపీ, బజాలీ, అస్సాం