హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/ కవాడిగూడ : కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆశ వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల జీతాలు పెంచాలని, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అనుబంధ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశ) సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేశారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన జరిగిన ధర్నాలో హరీశ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశాలకు జీతాలు పెంచారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి జీతాలు పెంచే సోయేలేదని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాలని అడిగితే కోఠిహెల్త్ డైరెక్టరేట్ వద్ద ఆశలను పోలీసులతో కొట్టించారని మండిపడ్డారు.
మహిళా మంత్రులు ఏం చేస్తున్నరు?
క్యాబినెట్లో ఇద్దరు మహిళా మంత్రులున్నా ఆశలు, అంగన్వాడీలు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొన్నదని హరీశ్ వాపోయారు. సురేఖమ్మ, సీతక్క రేవంత్‌కు రాఖీ కట్టినప్పుడు ఆశల సమస్యల గురించి ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. 30లోపు బిల్లులు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ప్రైవేట్ హాస్పిటళ్లు చెప్పాయని, ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులను అరెస్ట్ చేయించి ఓయూలోకి!
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన బిల్డింగ్‌ను ప్రారంభించేందుకు రేవంత్‌రెడ్డి వెళ్తే మూడు రోజుల ముందు నుంచే విద్యార్థులను అరెస్టు చేయడం ఏమిటని హరీశ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి మోసం చేసిన రేవంత్ ముక్కు నేలకు రాసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో టీడీపీలో ఉన్న రేవంత్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు విద్యార్థులు తరిమికొడితే సందులోపడి పారిపోయాడని గుర్తుచేశారు.
ముందస్తు అరెస్టులు పిరికిపంద చర్య
ఓయూలో విద్యార్థుల ముందస్తు అరెస్టు పిరికిపంద చర్య అని హరీశ్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ఒక విద్యార్థి మీద పోలీసు లాఠీ పడ్డా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇందుకేనా సీఎం రేవంత్ విద్య, హోంశాఖ తన వద్ద పెట్టుకున్నది? అని ప్రశ్నించారు. ‘రేవంత్ మోసపూరిత హామీల గురించి యావత్ తెలంగాణ నిలదీస్తున్నది. తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా?’ అని నిలదీశారు. పోలీసు బలం, బలగం, ఇనుప కంచెలు, బారికేడ్లతో తిరుగుబాటును ఆపలేరని, విద్యార్థులు, నిరుద్యోగులు సింహాలై గర్జిస్తారని హెచ్చరించారు.