హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచడంపై ఆశాకార్యకర్తలు పట్టువీడటం లేదు. అరెస్టులు, బెదిరింపులతో ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా తమ పోరాటాన్ని ఆపడం లేదు. మంగళవారం మరోసారి వందల మంది ఆశా కార్యకర్తలు హైదరాబాద్ కోఠిలోని ఎన్హెచ్ఎం కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ వేతనాన్ని పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. సోమవారం ఆశా కార్యాకర్తలపై పోలీసులు చేసిన దాడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఆశాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. వారు హైదరాబాద్‌కు రాకుండా ఎక్కడికక్కడ జిల్లాల్లో అరెస్టులు చేశారు. హైదరాబాద్‌ని కోఠి ఎన్హెచ్ఎం కార్యాలయం ఆవరణలోనూ పోలీసులు మోహరించారు. సోమవారం నాటి ఘటన నేపథ్యంలో మంగళవారం ఎక్కువగా మహిళా పోలీసులను మోహరించారు. ఆశాలు రాగానే నిర్బంధించారు. కొందరిని మాత్రమే ఎన్హెచ్ఎం కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలిసేందుకు అవకాశం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పీ జయలక్ష్మి మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పొందుపర్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వం మోసం చేస్తున్నదని, హామీలను అమలుచేయాలని కోరినా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పోలీసులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో యూనియన్ ప్రతినిధుల చర్చలు సఫలమైనట్టు జయలక్ష్మి తెలిపారు.
ధర్నాకు తరలివచ్చిన ఆశా వర్కర్లు కొందరు రోడ్డుపై బైఠాయించగా వారిని కార్యాలయ ఆవరణకు తరలించేందుకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ అంగీకరించక పోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్, హైదరాబాద్ సెంట్రల్ కార్యదర్శి ఎం వెంకటేష్, హైదరాబాద్ సౌత్ అధ్యక్షురాలు ఎం మీనా, రాష్ట్ర నాయకులు యాదమ్మ, పద్మ, కే సునీత, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఆశా వరర్ల స్వేచ్ఛను గౌరవిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఆశాల ఆందోళనలపై మంగళవారం ఆయన స్పందించారు. విజయోత్సవాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షాలు ఆశా వరర్లను రెచ్చగొట్టాయని ఆరోపించారు. ఆశాలు సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. సొమ్మసిల్లిన ఆశా వరర్ రహీంబీకీ ఉస్మానియా దవాఖానలో మెరుగైన చికిత్స అందించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ 18 వేల వేతనంపై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్లు రాజేశం, కృష్ణవేణి తెలిపారు. ప్రతి ఆదివారం, పండుగ సెలవులను అమలుచేస్తామన్నారు. లెప్రసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు త్వరలోనే చెల్లిస్తామని హామీఇచ్చారు. ఆశాలకు సెలవులు కావాలంటే ఏఎన్ఎంలకు చెప్పి తీసుకోవచ్చని సూచించారు.
హైదరాబాద్‌లోని ధర్నాకు తరలివెళ్లకుండా నల్లగొండ, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో ఆశా వర్కర్లపై పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. వీరి అక్రమ అరెస్టులను సీఐటీయూ ఖండించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసులు ఆశా వర్కర్లను అరెస్టుచేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి సిరిసిల్ల మీదుగా బయల్దేరిన వారిని శివారులోనే అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లలో సుమారు 25 మందిని అరెస్టుచేశారు. వేములవాడలోనూ అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వ్యక్తిగత పూచీపై వదిలిపెట్టారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో 31 మందిని అరెస్ట్ చేశారు. గోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జగిత్యాలలో అరస్టైన ఆశాలను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పరామర్శించారు. మల్యాలో అరస్టైన ఆశాలను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. కారేపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆశాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నాగేశ్వర్రావు సంఘీభావం తెలిపారు.
అశ్వారావుపేట నుంచి బయల్దేరిన ఆశాలను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ.. ముందస్తు అరెస్టులు సరికాదన్నారు. ఆశా వర్కర్లపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ.. ఆశవర్కర్లు తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తే దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఆశావర్కర్లు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
హక్కుల సాధనకు హైదరాబాద్‌లోని కోఠి మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలపై పోలీసులు దాడి ఘటనపై జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ నేతృత్వంలో బీఆర్ఎస్ మహిళా నేతలు మంగళవారం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మగ పోలీసులు ఇష్టానుసారంగా దూషిస్తూ మహిళలపై క్రూరమైన దాడికి పాల్పడ్డారని చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు.
మాట్లాడలేని భాషలో దుర్భాషలాడారని, ముఖ్యంగా ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాస్ ఆశా కార్యకర్తల వస్త్రాలను లాగి, వ్యాన్లలో ఎత్తివేసిన విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ సమగ్రంగా విచారించి ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాస్‌తోపాటు పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ మహిళా నాయకులు సుశీలారెడ్డి, అర్పితాప్రకాశ్, కిర్తీలతాగౌడ్ తదితరులు ఉన్నారు.