హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ సర్కారు తీరు ఉన్నది. నాడు అధికారమే పరమావధిగా ఆశ కార్యకర్తలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొండి‘చెయ్యి’ చూపుతున్నది. కష్టానికి తగ్గట్టు రూ.18 వేల వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, హెల్త్‌కార్డులు ఇస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టింది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క ఎన్నికల సభల్లో పదే పదే ఊదరగొట్టారు. ఇప్పుడు గద్దెనెక్కి 15 నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదు. అటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఇటు మంత్రికి విన్నవించినా పట్టించుకోవడం రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు గౌరవం పెంపు.. నేడు మర్యాద కరువు
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 28,162 మంది ఆశ కార్యకర్తల సేవలను గుర్తించి నాడు బీఆర్ఎస్ సర్కారు వారికి సముచిత గౌరవమిచ్చింది. కాంగ్రెస్ హయాంలో వేతనం రూ.1,200 మాత్రమే. అది కూడా మూడు, నాలుగు నెలలకోసారి ఇచ్చేవారు. కానీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 మే నెలలో రూ.6 వేలకు వేతనం పెంచారు. మళ్లీ అదే ఏడాది సెప్టెంబర్‌లో అడగకుండానే రూ.7,500 చేశారు. అంతేగాకుండా ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ పరిధిలోకి తెచ్చారు. 2020లో పీఆర్సీకి అనుగుణంగా 30 శాతం అంటే రూ.9,750కి హెచ్చించారు. అలాగే క్రమం తప్పకుండా ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలను ఖాతాల్లో జమ చేసేవారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి నుంచి మూడు నెలల పాటు వేతనాలు నిలిపివేశారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆందోళనకు దిగితే రెండు, మూడు నెలలు సక్రమంగా ఇచ్చి తిరిగి ఆపివేశారని, పెద్దఎత్తున ధర్నా, నిరసనలకు ఉపక్రమించిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చెబుతున్నారు. కాంగ్రెస్ హ యాంలో తమ సేవలను గుర్తించడం లేదని వాపోతున్నారు. గతంలో ప్రతినెలా తమ సమస్యలపై మంత్రి, అధికారులు సమీక్ష నిర్వహించేవారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాడులు చేయిస్తున్న సర్కారు
ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగితే సర్కారు తమపై దాష్టీకానికి దిగుతున్నదని ఆశ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుడు డిసెంబర్ 9న హైదరాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై పోలీసులతో సర్కారు దాడులు చేయించిందని వాపోతున్నారు. నేరస్థులు, అసాంఘిక శక్తుల మాదిరిగా మగ పోలీసులు చితకబాది, వ్యాన్లలో లాగిపడేసినట్టు చెబుతున్నారు. రెండ్రోజుల క్రితం కోఠిలో ఆందోళన చేసిన ఆశ కార్యకర్తలపై ఇదే రీతిలో జులుం ప్రదర్శించారని కన్నీటిపర్యంతమవుతున్నారు. ‘మేం ఏం తప్పు చేశాం? ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడగడమే పాపమా?’ అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే వేతనాలు పెరుగుతాయనకున్న తమ ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు మంత్రులు, అధికారులను అడిగినా నిధుల్లేవని సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు.
తాడోపేడో తేల్చుకుంటాం
సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. ఖజానాలో నిధులు లేవని సాకులు చెబుతూ తప్పించుకుంటున్నది. కేసీఆర్ పాలనలో గౌరవంగా విధులు నిర్వర్తించిన తమను చిన్నచూపు చూస్తున్నది. ఆందోళనకు దిగితే పోలీసులతో దాడులు చేయిస్తున్నది. ఇక ఈ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. అసెంబ్లీకి వెళ్లి మంత్రులకు వినతిపత్రాలు అందజేస్తాం. త్వరలో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటాం.
– సంతోష, ఆశ కార్యకర్తల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు