నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 19 : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు కదం తొక్కారు. బుధవారం జోగుళాంబ గద్వాల, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగారు. గద్వాలలో ఉదయం 7 గంటలకే జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ గేటు వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు. వీరికి బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య మద్దతు తెలిపారు. అధికారులు ఎవరూ ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్లకుండా కార్యకర్తలు అడ్డుకొన్నారు. కలెక్టర్ తమ సమస్యలను ఆలకించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వారి వద్దకు రాకపోవడంతో ఆగ్రహంతో గేటును తోసుకుంటూ కలెక్టర్ చాంబర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.