ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రీ సర్వేలు, వాయిదాల పద్ధతి లేకుండా ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు జరగాల్సింది రీ సర్వే కాదని, రీపోలింగ్ అని స్పష్టం చేశారు. ఎలక్షన్ ఎప్పుడు జరిగినా ప్రజల సెలెక్షన్ కేసీఆరేనని, రేవంత్‌రెడ్డిని ఇంటికి సాగనంపడం ఖాయమని పేర్కొన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ, రేవంత్రెడ్డిలిద్దరూ ఐరన్ లెగ్‌లేనని, వారెక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ బుగ్గిపాలై బొగ్గుగా మారుతుందన్నారు.
రాహుల్‌గాంధీకి రైఫిల్‌రెడ్డి బాగోతాలన్నీ తెలిసిపోయాయని, అందుకే రేవంత్ మొహం చూడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదన్నారు. 32సార్లు ఢిల్లీకి వెళ్లినా రేవంత్‌కు రాహుల్ అపాయింట్మెంట్ దొరకలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. కులగణన రిపోర్టు పట్టుకెళ్లినా రేవంత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఆరు హామీలపై ప్రశ్నిస్తారనే భయంతోపాటు, రేవంత్ ముఖం చూడడం ఇష్టం లేకనే రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారని తెలిపారు. రాహుల్‌గాంధీ తీరును చూసి సీఎంను మార్చడానికే ఇదంతా అని కాంగ్రెస్‌లో గుసగుసలు మొదలైనట్టు పేర్కొన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఎవరికి వారే గుంపులుగా విడిపోయి ఢిల్లీలో సీఎం పదవి కోసం పైరవీలు చేసుకుంటూ పాలనను గాలికొదిలేశారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ర్టానికి సుస్థిర పాలన అందిస్తే, రేవంత్ రాష్ర్టాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేస్తున్నారని విమర్శించారు. తలకింద పెట్టి తపస్సు చేసినా రేవంత్‌ను ఇక తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జీరో రావడం ఖాయమన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులను గ్రామ పొలిమేరల్లోకి రాకుండా తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా కారు రావాలి.. కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారని జీవన్‌రెడ్డి అన్నారు.