వినాయకనగర్, మే 18 : ‘మొన్న మోదీ రేవంత్‌రెడ్డితో అన్నారు. ‘మేరేసేహీ జోడో’ అని! వారిద్దరి మధ్య ఏమన్న లింకున్నదో.. ఏమో? నాకైతే తెల్వదు. నేను బీజేపీలో ఒక చిన్న కార్యకర్తను మాత్రమే.. అందుకే కాంగ్రెసోళ్లకు ఓ సలహా ఇస్తున్నా.. పార్టీకి జీవితాంతం సేవ చేసిన జెన్యూన్ నాయకులకు సీఎం పదవి ఇచ్చుకోవాలె.. ‘ఆయన’కు ఏదో మంత్రి పదవి ఇస్తే అయిపోవు’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘బెంగాల్లో సువేందు అధికారిలాగా కలుస్తారేమో, అందుకే తనతో కలిసి పనిచేయాలని రేవంత్‌రెడ్డితో మోదీ అన్నారేమో.. వారిద్దరి మధ్య ఏమన్న లింకున్నదో ఏమో’నని అనుమానం వ్యక్తంచేశారు. నిజామాబాద్ ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి వంచించారని విమర్శించారు. నిజామాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డు ఇస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు విస్మరించాడని, కాంగ్రెస్ పూర్తిగా ఖతమవుతుందని హెచ్చరించారు. ‘బిడ్డా రేవంత్.. ప్రజలు నీ లాగులో తొండలు సొరగొడతరు జాగ్రత్త. అప్పుడు నువ్వే పారిపోతవు’ అని వార్నింగ్ ఇచ్చారు.
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను రాజకీయంగా పూర్తిగా ఖతం పట్టిద్దామని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నాడని చెప్పా రు. ‘ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలున్నరు. ఒకరు ప్రభు త్వ సలహాదారు ఉన్నరు. ఆయనకే ఒక రు అడ్వైజ్ ఇవ్వాలి. అలాంటిది.. ఆయ నే అడ్వైజరట! ఇక్కడ ఉన్న ముగ్గురు పీసీసీ, అడ్వైజర్, ఎమ్మెల్యే ఏం చేసిం డ్రు?’ అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి కుమారుడిపై పోక్సో కేసు నమోదుపై విలేకరులు ప్రశ్నించగా.. ‘చట్టం ఎవరికీ చుట్టం కాదు’ అని చెప్పి దాటవేశారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పాల్గొన్నారు.