హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణలోని తమ అనుబంధ సైంస్థెన యుజియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్‌కు చెందిన ఫార్ములేషన్ తయారీ కేంద్రానికి అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ హెచ్చరిక లేఖ జారీ చేసిందని అరబిందో ఫార్మా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణలో ఉన్న యుజియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్ యూనిట్-1(ఫార్ములేషన్ తయారీ కేంద్రం)ను యూఎస్ఎఫ్డీఏ ఫిబ్రవరి 16 నుంచి 26 వరకు తనిఖీ చేసిందని కంపెనీ మే నెలలోనే వెల్లడించింది.
ఈ తనిఖీ నాలుగు పరిశీలనలో ముగిసిందని, ఈ యూనిట్లో పలు అభ్యంతరాలు వ్యక్తంచేసిన నియంత్రణ మండలి ప్రస్తుతం హెచ్చరిక లేఖను జారీ చేసినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ లేఖతో ప్రస్తుతం అమెరికా మార్కెట్లలో జరుగుతున్న సరఫరాపై ఎలాంటి ఆందోళన లేదని తెలిపింది. యుజియా ఫార్మాస్పెషాలిటీస్కు చెందిన యూనిట్-1 కంపెనీ మొత్తం గ్రూపు ఆదాయంలో సుమారు 2 శాతం వాటాను సమకూరుస్తున్నదని పేర్కొంది. యూఎస్‌ఎఫ్‌డీఏతో పని చేయడానికి కట్టుబడి ఉన్నామని, నిరంతరం తమ నిబంధనల అనుకూలతను మెరుగుపరుచుకుంటూనే ఉంటామని అరబిందో వెల్లడించింది.