వరంగల్ చౌరస్తా: ఎన్నికల ప్రచారంలో మూడు నెలల్లో ఉద్యోగాలిస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని కళాకారులు భిక్షమెత్తి నిరసన తెలిపారు. శనివారం సకల కళాసాంస్కృతిక మండలి, తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యవేదిక, వారసత్వ కళల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి ఎంజీఎం సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా కరపత్రాలు పంచుతూ.. పాటలు పాడుతూ జోలెపట్టి భిక్షమెత్తారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ‘ఒడ్డెక్కే వరకు ఓడ మల్లన్న ఒడ్డెక్కినాక బోడ మల్లన్న’ అన్నట్టుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీరని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హత ఉన్న కళాకారులకు టీఎస్ఎస్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అనుసరిస్తున్న విధంగా కళాకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సకల కళాసాంస్కృతిక మండలి రాష్ట్ర అధ్యక్షడు గడ్డం సుధాకర్, తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు బిర్రు సురేందర్, వారసత్వ కళల సంరక్షణ సమితి అధ్యక్షుడు ఎస్కే రాజు, కళాకారులు పాల్గొన్నారు.