కరీంనగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏడాది క్రితం వరకూ కళకళలాడిన గ్రామ పంచాయతీలు ప్రస్తుతం పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గడిచిన పదకొండు నెలలుగా గ్రాంటు అందక పంచాయతీ నిర్వహణకు కార్యదర్శులు అష్టకష్టాలు పడుతున్నారు. సొంత జేబుల నుంచి డబ్బులు పెడుతూ అప్పుల పాలవుతున్నారు. పారిశుద్ధ్యం నుంచి బ్లీచింగ్ పౌడర్ వరకు అన్నీ సొంత డబ్బులతోనే కొనుగోలు చేస్తున్న కార్యదర్శుల మొరను రేవంత్ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా వివిధ కార్యక్రమాల పేరిట వారిపై అదనపు భారం మోపుతున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఖాతాలు ఖాళీ అయ్యాయి. రోజురోజుకూ తడసి మోపెడవుతున్న ఖర్చులను భరించలేక.. ఇప్పటికే పెట్టిన డబ్బుకు సంబంధించిన బిల్లులు రాక, ఇంకా సొంత జేబులనుంచి పెట్టే స్థోమత లేక కార్యదర్శలు క్షేత్రస్థాయిలో నానా యాతన పడుతున్నారు. బిల్లుల కోసం చేసిన విన్నపాలు బుట్టదాఖలు అవుతుండగా.. కలెక్టర్లు, ప్రత్యేకాధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే అదేశాలను పంచాయతీ కార్యదర్శులపై రుద్దడమే తప్ప.. పైసా విదిల్చడం లేదు.
రాష్ట్రంలో సర్పంచ్ల గడువు ఫిబ్రవరిలో ముగిసింది. వెంటనే పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన ఆరు నెలలలోగా ఎన్నికలు జరగాలి. కానీ, అనేక కారణాల రీత్యా సమీపక్ష భవిష్యత్తులో పంచాయతీ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఎన్నికలు జరగనందున కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి.
సాధారణంగా రోజువారీ పనుల కోసం మైనర్ పంచాయతీలలో నెలకు రూ.20వేల నుంచి 25వేలు, మేజర్ పంచాయతీలలో రూ.1.50ల లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతాయి. గ్రామాల్లో ఇంటి పన్ను, పెనాల్టీల రూపయంలో వచ్చే ఆదాయాన్ని కార్యదర్శులు జనరల్ ఫండ్ కింద ట్రెజరీలో జమ చేస్తారు. కనీసం ఈ డబ్బును వినియోగించుకుందాంటే.. ట్రెజరీ అధికారులు ఏప్రిల్ నుంచి చెక్లు పాస్ చేయడం లేదు. అడిగితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని చెప్తున్నారు. నిధులు లేవని పనులు చేయకపోతే ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఓ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో 313 పంచాయతీలుంటే.. వాటి పరిధిలో గడిచిన 11 నెలల కాలంలో కార్యదర్శులు తమ జేబుల్లోనుంచి పెట్టిన ఖర్చు సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా అక్షరాల క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు సొంత జేబుల నుంచి పెట్టిన డబ్బులు ఇప్పించాలని కోరుతూ.. పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ల ఆధ్వర్యంలో కలెక్టర్లకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదు.