వరంగల్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, పదేండ్ల సుపరిపాలన మేళవింపుగా ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు మొదలయ్యాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల పనులకు బుధవారం పూజ కార్యక్రమంతో అంకురార్పణ చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడంతో ఆ ప్రాంగణంలో సందడి కనిపించింది.
సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటుచేసిన స్కై బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాసభ నిర్వహించే ప్రదేశాన్ని ప్రొక్లయిన్తో చదును చేయడం మొదలుపెట్టారు. 1,213 ఎకరాల విశాల ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించేలా పనులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వ్యవస్థాపక నాయకుడు, మాజీ ఎంపీ వొడితెల లక్ష్మీకాంతారావు-సరోజన దంపతులు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, స్టేట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎం సుధీర్‌కుమార్, మర్రి యాదవరెడ్డి, కే వాసుదేవరెడ్డి, వై సతీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానున్నది. లక్షలాది మందితో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జరగనున్నది. ఎల్కతుర్తి మండల కేంద్రం బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ముస్తాబవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రజలు, వేలాది వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఉండే ఎల్కతుర్తిని రజతోత్సవ మహాసభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ముఖ్యనేతలు రజతోత్సవ మహాసభ ఏర్పాట్లలో నిగమ్నమయ్యారు.
రజోత్సవ మహాసభ వేదిక, బహిరంగసభ, వాహనాల పార్కింగ్, ప్రజలకు అవసరమైన అన్ని వసతుల కల్పనకు వేగంగా ప్రణాళిక రూపొందించారు. 60 ఏండ్ల ఆకాంక్షల ప్రతిరూపంగా 2001 ఏప్రిల్‌లో ఆవిర్భవించిన బీఆర్ఎస్, అలుపెరగని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసింది. 2014 నుంచి పదేండ్ల సుపరిపాలనతో తెలంగాణ రాష్ర్టాన్ని భారతదేశానికే దిక్సూచిగా నిలిపింది. 14 ఏండ్ల ఉద్యమం, పదేండ్ల సుపరిపాలన మేళవింపుగా ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వేదికగా ‘బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ’ జరుగుతున్నది. భారీ బహిరంగ సభలు అంటేనే బీఆర్ఎస్ అని దేశ రాజకీయాల్లో నానుడి ఉన్నది. స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా సాగిన ఉద్యమ ప్రస్థానంలో భాగంగా బీఆర్ఎస్ ఎన్నో భారీ బహిరంగ సభలను నిర్వహించింది.
వరంగల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలు ప్రపంచ రికార్డులను నమోదు చేశాయి. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సైతం అదే స్థాయిలో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 1,059 ఎకరాల్లో వాహనాల పార్కింగ్, 154 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ వేదికను సిద్ధం చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా బహిరంగసభ ప్రదేశంలో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందించనున్నారు. మరో 10 లక్షల అర లీటరు నీళ్ల బాటిళ్లను సిద్ధం చేశారు. సభ నిర్వహణకు అనుగుణంగా 15 వందల మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలు, పురుషుల కోసం వేల సంఖ్యలో టాయిలెట్లు, అత్యవసర వైద్యసేవలు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభలో 25 ఏండ్ల పార్టీ చరిత్ర ఆవిష్కృతం కానున్నదని, దేశంలోనే అతిపెద్ద సభగా ఎల్కతుర్తి సభ నిలుస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. రజతోత్సవ మహాసభకు ప్రజలు భారీగా తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయాలని పిలుపునిచ్చారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగా, నేడు కాంగ్రెస్ పాలనలో అధోగతి వైపు సాగుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో తాగునీటికి, సాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను కాదనుకుని తప్పు చేశామని ప్రజలు విచారం వ్యక్తంచేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ వచ్చిన తర్వాతే హైదరాబాద్, వరంగల్ బాగు పడ్డాయని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడంలేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని దుయ్యబట్టారు. మహాసభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ మహాసభకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రజతోత్సవ మహాసభకు తరలివచ్చే ప్రజల కోసం సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మూడు జాతీయ రహదారులకు కేంద్రంగా ఉన్న ఎల్కతుర్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మహాసభ నిర్వహణకు ఎంపిక చేశారని చెప్పారు. మహాసభ ప్రాంగణం కాకుండా మూడు వైపులా పార్కింగ్ కోసం వెయ్యి ఎకరాలను సేకరించామని, వాహనాల రాకపోకల కోసం అంతర్గతంగా కొత్త రోడ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఉద్యమం సమయంలోనూ, అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అనేక మహాసభలను నిర్వహించిందని, ఈ రజతోత్సవ మహాసభ కూడా గొప్పగా ఉంటుందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ సూచనల మేరకు మహాసభ నిర్వహణ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
ప్రపంచంలోని ఐదు అతి పెద్ద సభల్లో ఒకటిగా గతంలో వరంగల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన సభ ఉన్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రజతోత్సవ సభను ప్రపంచంలోనే అతిపెద్ద సభగా కీర్తికెక్కేలా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇచ్చిన పిలుపును క్రమశిక్షణతో అమలుచేసిన చరిత్ర వరంగల్‌కు ఉన్నదని, రజతోత్సవ మహాసభను విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. తెలంగాణను తెర్లు చేస్తున్న దొంగలను తరిమికొట్టే రోజు వచ్చిందని అన్నారు. మహాసభకు ప్రజలు కూలి పని చేసుకుంటూ స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని చెప్పారు.
ఎల్కతుర్తిలో రజతోత్సవ మహాసభను నిర్వహించడం మనమందరం గర్వించదగ్గ విషయమని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ 25 ఏండ్ల మహాసభను హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. మహాసభ కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, మిగిలిన అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాలని కోరారు. సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలం కోసం తమ భూములు వాడుకోండి అంటూ ముందుకు వచ్చిన ఎల్కతుర్తి, చింతలపల్లి, ఇందిరానగర్, గోపాల్పూర్ రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రజతోత్సవ మహాసభ విజయవంతం కోసం ప్రతి కార్యకర్త సైనికుడి మాదిరిగా పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 15 నెలల్లోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నదని విమర్శించారు. చరిత్రాత్మక మహాసభను ఇక్కడ నిర్వహించే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.