వరంగల్, మార్చి 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, కోమటిపల్లిలో సభ నిర్వహణకు అనువైన పరిసరాలను మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ స్థలం సభ నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ ప్రాంతానికి అనుసంధానమయ్యే రవాణా వ్యవస్థ ఉన్నదని అభిప్రాయపడ్డారు. రజతోత్సవ సభకు వచ్చే లక్షాలాది మందికి రవాణ, తాగునీరు, ఇతర విషయాల్లో ఇబ్బంది లేనివిధంగా అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు బీఆర్ఎస్ నేతలు అన్వేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, ప్రత్యేక రాష్ట్రంలోనూ సెంటిమెంట్‌గా ఉంటున్న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను లక్షలాది మందితో ఏప్రిల్ 27న నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లు, బహిరంగసభ వేదిక ఎంపిక కోసం హరీశ్‌రావు ఈ నెల 10న వరంగల్ నగర శివారులోని భట్టుపల్లి, ఉనికిచర్ల స్థలాలను పరిశీలించారు. శుక్రవారం మరోసారి వరంగల్‌కు వచ్చి బహిరంగసభ నిర్వహణకు అనుకూలంగా ఉండే మరికొన్ని స్థలాలను పరిశీలించారు. బహిరంగసభల నిర్వహణలో బీఆర్ఎస్కు తిరుగులేని రికార్డు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డిపేటలో ‘తెలంగాణ మహాగర్జన’ పేరుతో నిర్వహించిన బహిరంగసభ ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద సభగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, దేశానికి దిక్సూచిగా నిలిచేలా బీఆర్ఎస్ పరిపాలన సాగిస్తున్న సమయంలో 2017లో మరోసారి వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డిపేటలో ‘ప్రగతి నివేదన’ పేరిట నిర్వహించిన బహిరంగ సభ ఎక్కువ మంది హాజరైన సభగా రికార్డులకు ఎక్కింది. పార్టీ ఏర్పడి 25 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో లక్షలాది జనంతో వరంగల్‌లో మరోసారి భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది.