నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న కేసులో బెయిల్ కోసం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సోమవారం జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదని కోరుతూ బంజారాహిల్స్ పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై సుమన్ తరఫు న్యాయవాది జీ కిరణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
చట్టప్రకారం ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరమే లేదని, కౌంటర్ పేరిట కాలయాపన చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని, రాజకీయ కక్షతో సుమన్‌కు బెయిల్ రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నదని తెలిపారు. కిందిస్థాయి కోర్టు ఈ కేసులోని పలు సెక్షన్లను తొలగించిందని, ఆ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ మళ్లీ జోడించారని, అధికారులు ప్రభుత్వ అడుగుజాడల్లో పనిచేస్తున్నారని మండిపడ్డారు.
152 సెక్షన్ దేశద్రోహ నేరానికి సంబంధించినదని, దేశాన్ని కించపరిచేవిధంగా సుమన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతివాదన చేస్తూ.. సమాజాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం చట్టవ్యతిరేకమని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలిటెంట్ ఉద్యమం చేయాలనడం సరికాదని పేర్కొన్నారు. వాదనలు పూర్తవడంతో తీర్పును ఈ నెల 10కి రిజర్వు చేస్తూ జడ్జి ఉత్తర్వులు జారీచేశారు.
ఈ కేసులో సుమన్‌ను లోతుగా ప్రశ్నించి మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించాల్సి ఉన్నదని, అందువల్ల ఆయనను 4 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసు 3వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సుమన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.