Congress | హైదరాబాద్/మహబూబ్‌నగర్/తొర్రూరు / స్టేషన్‌ఘన్‌పూర్/భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఖరారుకు ముందే సిగపట్లు మొదలయ్యాయి. దరఖాస్తుల పరిశీలన సమయంలోనే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన కోసం మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన ఎన్నికల కమిటీ భేటీ రచ్చ రచ్చ అయింది. సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తున్నది. మరీ ముఖ్యంగా రేవంత్, ఉత్తమ్‌కుమార్ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నట్టు సమాచారం. ఒకే కుటుంబానికి రెండు టికెట్లపై వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగినట్టు తెలిసింది.
ఉత్తమ్, ఆయన భార్య పద్మావతి రెండు సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, దీనిపై స్పష్టత ఇవ్వాలని మహేశ్‌గౌడ్ కోరారు. స్పందించిన ఉత్తమ్.. దీనిపై ఇప్పుడు చర్చ ఎందుకని, ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జోక్యం చేసుకున్న రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందని పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉత్తమ్.. పీసీసీ అధ్యక్షుడిగా దీనిపై అభిప్రాయం చెప్పాలని, హైకమాండ్‌కు సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. కల్పించుకున్న రేవంత్ టికెట్ల విషయంలో తనను డిక్టేట్ చేయొద్దని ఉత్తమ్‌కు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనపై సీనియర్ నేత బలరాంనాయక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. టికెట్లను ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ నేత వీహెచ్ కూడా తన వాదన బలంగానే వినిపించారు. బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారు? ఎక్కడ ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఎన్ని టికెట్లు ఇస్తారో చెప్పాలని రేణుకా చౌదరి కోరారు. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ తనను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి కూడా ఫైరయ్యారు.మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది.
ఎటూ తేల్చని కమిటీ
దరఖాస్తుల పరిశీలన కోసం భేటీ అయిన ఎన్నికల కమిటీ ఆ విషయాన్ని ఎటూ తేల్చకుండానే సమావేశాన్ని ముగించేసింది. సెప్టెంబర్ 2న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. దరఖాస్తుల పరిశీలనను పూర్తిచేసే సత్తా ఈ కమిటీకి ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తొలి భేటీలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై ఆశావాహులతో పాటు నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలకుర్తిలో భగ్గుమన్న వర్గపోరు
పాలకుర్తి కాంగ్రెస్‌లో ఎన్నారైల కుమ్ములాట వీధికెక్కింది. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్న ఆ పార్టీ ఎన్నారై సెల్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి.. తొర్రూరు మండలం చర్లపాలేనికి చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి సతీమణి ఝాన్సీరెడ్డి వర్గీయుల మధ్య వర్గపోరు భగ్గుమన్నది. మంగళవారం తొర్రూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఝాన్సీరెడ్డి నాయకత్వం వర్ధిలాలి, తిరుపతిరెడ్డి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆరేండ్లుగా కాంగ్రెస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని, కాంగ్రెస్ ఎన్నారై విభాగంలో కూడా ఝాన్సీరెడ్డికి సభ్యత్వం లేదని, పార్టీ కోసం ఏనాడూ పని చేయలేదని, పాలకుర్తి టికెట్ ఆశించడం సరికాదని తిరుపతిరెడ్డి తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమావేశంలో సింగపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్య వర్గీయుల మధ్య స్వల్పంగా తోపులాట కూడా జరిగింది. స్టేషన్ఘనపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఇందిర, దొమ్మాటి సాంబయ్య, గంగారపు అమృతరావు, చేపూరి వినోద్‌కుమార్, బొల్లపల్లి కృష్ణ, సిరిసిల్ల రాజయ్య, డాక్టర్ రాజమౌళి దరఖాస్తు చేసుకున్నారు.
భద్రాద్రిలో బయటపడుతున్న లుకలుకలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల లొల్లి మొదలైంది. ఆ పార్టీ అగ్రనేతలు రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి అనుచరులుగా కొనసాగుతున్న నాయకులు ఎవరికి వారు టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన కూడా కొత్తగూడెంలో క్యాంపు కార్యాలయాన్ని తెరిచారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎడవల్లి కృష్ణ ఇటీవల మాజీ మంత్రి రేణుకా చౌదరిని కొత్తగూడేనికి తీసుకువచ్చి సమావేశం నిర్వహించారు. సీటు బీసీకే కేటాయించాలని డిమాండ్ చేశారు. మరో వైపు కొత్తగూడెం నుంచే పోటీ చేస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో క్యాంపు కార్యాలయం ప్రారంభించారు. నాగ సీతారాములు మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను తీసుకొచ్చి సమావేశం నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన మరోనేత పోట్ల నాగేశ్వరరావు కూడా కొత్తగూడెం టికెట్‌పై ఆశలు పెట్టుకుని క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు.
పాలమూరులో ఒడవని లొల్లి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ తారస్థాయికి చేరింది. టికెట్ల కోసం తన్నుకుంటున్నారు. రేవంత్ డైరెక్షన్లో జడ్చర్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లురవి టికెట్ల రాయబారం నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ లో అందలం ఎక్కి పార్టీ ఫిరాయించిన కొ డంగల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి ఆ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఆ స్థా నం నుంచి రేవంత్ పోటీ చేయనున్నట్టు తేలడంతో ఆయన కంగుతిన్నారు. నాగర్‌కర్నూల్‌లో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి పొగ బెట్టేందుకు రాజకీయ బద్ధశత్రువైన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిని రేవంత్ రంగంలో దించినట్టు ప్రచారం జరుగుతున్నది. కొల్లాపూర్‌లో జూపల్లి కృ ష్ణారావును కాంగ్రెస్‌లోకి తీసుకురావడం లో ప్రధానపాత్ర పోషించిన అభిలాష్రా వు అసంతృప్తితో కారెక్కేశారు. మేఘారెడ్డి వనపర్తి కాంగ్రెస్ టికెట్ తీసుకొని సత్తా చూపిస్తాని ప్రతిజ్ఞ చేసినా అక్కడ అంత సీన్లేదని తేలింది. ఆ టికెట్ తనకే వస్తదని మాజీ మంత్రి చిన్నారెడ్డి అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సీతమ్మ మళ్లీ రావడంతో కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. ఆ మె రాకను దేవరకద్ర, మక్తల్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి, మళ్లీ అక్కడి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన న్యాయవాది ఎన్పీ వెంకటేశ్, నారాయణపేట కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న శివకుమార్‌రెడ్డి, జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనిరుధ్‌రెడ్డి, గద్వాలలో టికెట్‌పై ఆశపెట్టుకున్న జెడ్పీ చైర్మన్ తిరుపతయ్య వంటివారు ఎవరికి వారే టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.