హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram Project ) పై ముఖ్యమంత్రి, మంత్రులు అవగాహన లేకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నెపల్లి పంపు( Kannepally Pump House ) హౌస్ నుంచి నీళ్లు వదిలితే రాష్ట్రాన్ని కరువు బారి నుంచి కాపాడుకోవచ్చని హితవు పలికారు.
ప్రాజెక్టులపై, రైతులపై చిత్తశుద్ధి ఉంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. గంధమళ్ళ, బస్వాపూర్ నుంచి మొదలుపెట్టి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, అప్పర్ మానేర్, మిడ్ మానేర్, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, సుందిళ్ల, ఎస్సారెస్పీ, అన్నారం బ్యారేజీ నీళ్లు మొత్తం తీసుకుపోయి గోదావరిలో ఒక్కదగ్గర పోసినా కూడా భద్రాచలానికి ఏమీ కాదని పేర్కొన్నారు. నీటిని స్టోరేజీ చేస్తే భద్రాచలం మునిగిపోతుందని చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదనలను తిప్పికొట్టారు.
ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించాలని సూచించారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో రానున్న రెండు సంవత్సరాల వరకు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదురయ్యే అవకాశముండడంతో రిటైర్డ్ ఇంజనీర్లు కన్నెపల్లి పంపు హౌజ్ నుంచి నీళ్లు విడుదల చేయవచ్చని సలహాలిస్తే వారిని జైలులో వేస్తానని అనడం శోచనీయమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అనడానికి షాబాద్ ఘటనే నిదర్శనమని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఇలాంటి సీరియల్ క్రైమ్స్ కనిపించలేదని వెల్లడించారు. నేరం చేయాలంటేనే వణుకు పుట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూ ఆక్రమణల మీదే శ్రద్ధ పెడుతూ మిగతా విషయాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.