హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 24 : రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా బీసీలకు అర్హత లేదా? రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో వీసీలుగా అగ్రకులాల వారినే నియమిస్తారా? అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. బీసీల జనాభా దామాషా ప్రకారం వైస్ చాన్స్లర్లతోపాటు ఇతర పదవుల్లో బీసీలను నియమించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఊరుకునేది లేదని, అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ మెడలు వంచి వాటా సాధిస్తామని చెప్పారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీల్లో ఇప్పటివరకు నియమించిన వైస్ చాన్స్‌లర్ పదవుల్లో కేవలం ముగ్గురికి మాత్రమే బీసీలకు అవకాశం కల్పించి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నతవిద్యా మండలి చైర్మన్‌గా కాకపోయినా, కనీసం వైస్ చైర్మన్‌గా కూడా బీసీలను నియమించలేదని దుయ్యబట్టారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా బీసీకి అవకాశం కల్పించకపోతే నిరసన తెలుపుతామని అన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల భూములను హైడ్రాతో కాపాడాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జ్యోతిరావుఫూలే, సావిత్రిబాయి ఫూలే జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు.