Secretariat | హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సచివాయలంలో వాస్తు మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండుమూడు విడతలుగా వాస్తు మార్పులు చేసినా పెద్దగా మార్పు కనిపించకపోవడంతో తాజాగా మరోసారి మార్పులు చేస్తున్నారు. ఈసారి ఏకంగా సచివాలయం ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారాన్నే తొలిగిస్తున్నారు. దీంతోపాటు రోడ్ల నిర్మాణం, సీఎం, మంత్రులు వచ్చిపోయే ‘రూట్’లలో భారీగానే మార్పులు జరుగుతున్నాయి. వాస్తవానికి సచివాలయానికి ఎదురుగా తూర్పువైపు ఉన్న ప్రధాన మహా ద్వారాన్ని ప్రభుత్వం ఆరు నెలల కిందటే మూసివేసింది. వాస్తు మార్పుల్లో భాగంగా ఈ ఏడాది జూన్ నుంచే గేటుకు తాళం వేశారు. ఆ మార్గం నుంచి ఎలాంటి రాకపోకలు జరగడం లేదు. పొరబాటున కూడా గేటు తెరువకుండా ఏకంగా ఇనుప తీగలు చుట్టేశారు. ఆదివారం మహాద్వారం గేట్లను తొలిగించారు. ద్వారాన్ని కూడా తొలిగించనున్నారు. చుట్టూ ఉన్నట్టుగానే రెయిలింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రధాన ద్వారాన్ని ఈశాన్యంవైపు జరిపి ఉత్తరం ద్వారానికి సమీపంలో నిర్మిస్తారు. ఈ మేరకు ఇప్పటికే అక్కడ రెయిలింగ్‌ను తొలిగించారు.
గేట్లతో పాటు రూట్లు
వాస్తుమార్పుల్లో భాగంగా రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధాన ద్వారం ఉన్న ప్రహరీకి ఆనుకొని ఉన్న గేట్-2, గేట్-3ని కలుపుతూ 27 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. మొత్తంగా ఈ పనులకు ప్రభుత్వం రూ.3.20 కోట్లు ఖర్చు చేస్తున్న ది. పనులు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈశాన్య మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రులు సైతం ఇదే మార్గాన్ని వినియోగించనున్నారు.
మార్పులు చేసినా కనిపించని మార్పు
సీఎం రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే పలుసార్లు వాస్తుమార్పులు చేశారు. మొదట సీఎం కాన్వాయ్‌లోని తెలుపు కార్లను తొలిగించి, నలుపు రంగు కార్లు తెచ్చిపెట్టారు. రేవంత్ అదృష్ట సంఖ్య 9 అని, కాన్వాయ్‌లో 9 కార్లు, వాటి నంబర్ ప్లేట్లపై 9 అంకె వచ్చేలా చూసుకున్నారు. మొదట్లో తూర్పువైపు మహాద్వారం మీదుగా రేవంత్ రాకపోకలు సాగించేవారు. కానీ పాలన గాడిన పడకపోవడంతో వాస్తు మార్పుల్లో భాగంగా జూన్ లో ఆ గేటును మూసివేశారు. పశ్చిమం గేటు ద్వారా రాకపోకలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వాస్తు మార్పులు చేపట్టారు. మంత్రుల ఛాంబర్లలోనూ వాస్తు మార్పులు చేశారు. సచివాయలంలోని 6వ అంతస్తులో సీఎం కార్యాలయం ఉంటుంది. అయితే సీఎం రేవంత్ తన అదృష్ట సంఖ్యకు అనుగుణంగా సచివాలయంలోని 9వ అంతస్తులోకి సీఎంవోను మార్చాలని భావించారు. పలుసార్లు 9వ అంతస్తులో ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతాపరంగా, సాంకేతికంగా తరలిం పు సాధ్యం కాదని అధికారులు తేల్చడంలో తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్టు తెలిసింది.