మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై భూరెడ్డిపల్లి వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. దీంతో బస్సుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహబూబ్నగర్ దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్కు తరలించినట్లు తెలిపారు. చికిత్స అనంతరం ఎనిమిది మంది డిశ్చార్జీ అయ్యారని, మరో ఐదుగురు మహబూబ్నగర్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ప్రమాదం సమయంలో బస్సులో 36 మంది ఉన్నారని చెప్పారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
