(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): మరణించిన, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్లతో పాటు డూప్లికేట్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇదేసమయంలో ‘సర్’ ప్రక్రియను నిర్లక్ష్యం చేసిన పలువురు రాజకీయ నాయకులు సిట్టింగ్ స్థానాలను కూడా నిలబెట్టుకోలేకపోయారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మేరకు బెంగాల్, తమిళనాడు ఘటనలను ఉదహరిస్తున్నారు.
దేశ చరిత్రలోనే తొలిసారి
దేశ ఎన్నికల చరిత్రలో ఇంతవరకూ ఎన్నడూ రికార్డు కానటువంటి ఓటింగ్ శాతం ఇటీవల బెంగాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో నమోదయ్యింది. 93.7 శాతం మంది ఈ ఎన్నికల్లో ఓటేశారు. ఇది 2021 అసెంబ్లీ ఎన్నికల్లోని 82 శాతం, 2024 లోక్‌సభ ఎన్నికల్లోని 79 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ. బెంగాల్లో ‘సర్’ ప్రక్రియ తర్వాత ఓటర్ల సంఖ్య సుమారు 91 లక్షల మేర తగ్గడంతో నకిలీలకు కళ్లెం పడటంతోపాటు, మరణించిన వారి ఓట్లను ఏరివేయడంతోనే ఈ రికార్డు స్థాయి ఓటింగ్ సాధ్యపడిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక, తమిళనాడులోనూ ‘సర్’ ప్రక్రియ అనంతరం ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రికార్డు స్థాయిలో 85.1 శాతం ఓటింగ్ నమోదైంది. 2021 ఎన్నికల్లో నమోదైన 73.6 శాతం ఓటింగ్‌తో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. తమిళనాట ‘సర్’ ప్రక్రియలో సుమారు 97 లక్షల పేర్లు జాబితా నుంచి తొలగింపునకు గురయ్యాయి. దీంతో ఓటర్ల సంఖ్య 6.7 కోట్ల నుంచి 5.73 కోట్లకు తగ్గిందని, ఓటర్ల సంఖ్య తగ్గడంతో సహజంగానే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యిందని నిపుణులు చెప్తున్నారు. నిరుడు బీహార్‌లోనూ ‘సర్’ ప్రక్రియను నిర్వహించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 67 శాతం మంది ఓటేశారు. బీహార్ చరిత్రలో ఈ స్థాయిలో పోలింగ్ నమోదవ్వడం ఇదే మొదటిసారని అని నిపుణులు తెలిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ 57 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్టు గుర్తు చేశారు.
‘సర్’తో దీదీకి సైలెంట్ షాక్
బెంగాల్లో మమత కంచుకోట బీటలువారడానికి ‘సర్’లో భారీగా ఓట్లను తొలగించడమే కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది ఓట్ల తేడాతో టీఎంసీ భారీగా సిట్టింగ్ స్థానాలను కోల్పోవడాన్ని దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. బెంగాల్లో అత్యధికంగా ముర్షిదాబాద్ జిల్లాలో 4.55 లక్షల మంది ఓటర్లను ‘సర్’ ప్రక్రియలో భాగంగా తొలగించారు. 2021 ఎన్నికల్లో ఆ జిల్లాలో ఉన్న 22 సీట్లలో 20 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించగా.. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తొమ్మిది స్థానాలకే మమత పార్టీ పరిమితమయ్యింది. మైనారిటీ ఓట్లను భారీగా తొలగించడమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక, ఉత్తర 24 పరగణాలు జిల్లాలో 3.25 లక్షల మంది ఓటర్ల పేర్లను ఇటీవల జాబితా నుంచి తొలగించారు. గతంలో ఈ జిల్లాలోని మొత్తం 33 స్థానాల్లో 28 సీట్లను గెలిచిన టీఎంసీ.. ఈసారి కేవలం 8 సీట్ల దగ్గరే ఆగిపోయింది. మాల్దా జిల్లాలో 2.39 లక్షల ఓట్లను తొలగించగా.. అక్కడ గతంలో టీఎంసీ 8 స్థానాలను గెలుచుకోగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. టీఎంసీ చేజార్చుకొన్న ఈ అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం. ‘సర్’ ప్రక్రియలో భాగంగా భారీగా ఓటర్లను తొలగించడమే టీఎంసీ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా బెంగాల్ ‘సర్’లో తొలగించిన ఓట్ల శాతం 11.88 శాతంగా ఉండగా.. బీజేపీ, టీఎంసీ మధ్య ఓట్ల వ్యత్యాసం 5.04 శాతంగా ఉండటం గమనార్హం. తమిళనాడులోనూ ‘సర్’ పేరిట 97.3 లక్షల ఓట్లను ఇటీవల తొలగించారు. ఇది స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయావకాశాలకు ప్రధానంగా గండి కొట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
నేతలకూ ఝలక్
‘సర్’ ప్రక్రియ రాజకీయ నాయకులకూ షాక్ ఇచ్చింది. పలువురు ప్రముఖులు అతి తక్కువ ఓట్ల తేడాతో తమ సిట్టింగ్ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. బెంగాల్లో మమతా బెనర్జీ క్యాబినెట్ సభ్యుల్లో చాలా మంది ఇలాగే ఓటమి చవిచూశారు. స్వయంగా దీదీతో పాటు 63 శాతం మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. మహిళా-శిశు సంక్షేమం, పరిశ్రమలు, విద్యుత్తు, విద్య, రవాణా, వెనుకబడిన తరగతులు, ఉత్తర బెంగాల్ అభివృద్ధి తదితర కీలక శాఖల మంత్రులందరూ ఓడిపోయారు. అలా మొత్తంగా 35 మంత్రుల్లో 22 మంది ఓటమిని చవి చూశారు. ఇందులో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. రాష్ట్ర మంత్రి, ప్రముఖ మైనారిటీ వర్గ నేత, జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధిపతి సిద్ధిఖీ చౌదరిని కూడా ఓటర్లు తిరస్కరించారు. ఇక, ‘సర్’ ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమిళనాడులో డీఎంకే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో 133 సీట్లను గెలుచుకొన్న స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఇటీవలి ఎన్నికల్లో 74 స్థానాలకు పరిమితమయ్యింది. గత స్టాలిన్ ప్రభుత్వ మంత్రివర్గంలోని 32 మంది మంత్రుల్లో 15 మంది మంత్రులు ఓడిపోవడానికి ‘సర్’లో తొలగించిన 5-10 వేల ఓట్లే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.