PV Narasimha Rao | అపరచాణక్యుడు, రాజనీతి దురంధరుడనే బిరుదులు పీవీకి ఊరికే రాలేదు. మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం కొనసాగించడం పీవీకేమీ నల్లేరు మీద నడకగా సాగలేదు. ఒకవైపు దివాలా తీసిన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే మరో వైపు విపక్షాల నుంచి ఎదురైన విశ్వాస పరీక్షల నుంచి గట్టెక్కుతూ వచ్చారు పీవీ. మరోవైపు సొంత పార్టీలో ఉత్తరాది అసమ్మతి నేతల ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేసుకుంటూ ముందుకుసాగాల్సి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే కృష్ణా,రామా అంటూ ప్రశాంత జీవితం గడపాల్సిన ఏడు పదుల వయసులో ఇంటా, బయటా ముప్పేట ఎదురైన సమస్యల్ని తన అపార రాజకీయ అనుభవ చతురతతో, చాణక్యనీతితో అవలీలగా అధిగమిస్తూ సమర్థంగా తిప్పికొట్టగలిగారు పీవీ!
ప్రధాని పదవిపై కన్నేసిన మరాఠ్వాడా నాయకుడు శరద్‌పవార్‌ను పక్కన పెడితే ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి అతన్నే ఒప్పించి, మెప్పించి తన కండ్లముందు ఉండేలా మంత్రివర్గంలో చేర్చుకున్నారు. రక్షణశాఖ వంటి కీలకమైన శాఖను అప్పగించి పని ఒత్తిడిలో మునిగి తేలేలా చేశారు. అయినప్పటికీ పీవీని గద్దెదించే అవకాశం కోసం శరద్‌పవార్ మొదటి నుంచీ కాచుకొని కూర్చున్నారు. తనకు ముఖ్య శాఖ అప్పగించలేదన్న ఆగ్రహంతో రగిలిపోతున్న అర్జున్‌సింగ్ ఆయనకు తోడయ్యారు. వీరిద్దరితో మరో అసమ్మతి నాయకుడు మాధవరావుసింధియా జతకట్టారు. దీంతో బయటి వారికంటే పీవీకి అంతర్గత శత్రువుల బెడదనే ఎక్కువైంది. రాజకీయంగా దెబ్బతీయడానికి తన ప్రత్యర్థులు పన్నే ఎత్తులను పీవీ ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ వచ్చారు. వరుస బాంబుల పేలుళ్ల దుర్ఘటన తర్వాత బొంబాయిలో అల్లర్లు జరిగాయి. అప్పుడు మహారాష్ట్ర సీఎంగా ఉన్న సుధాకర్‌నాయక్‌ను అల్లర్ల సాకుతో గద్దె దింపడానికి శరద్ పావులు కదిపారు. వాస్తవానికి సుధాకర్‌నాయక్‌ను సీఎంను చేసింది శరద్‌పవారే.
మహారాష్ట్ర సీఎంగా ఉన్న శరద్ పవార్‌ను ప్రధాని పీవీ మంత్రివర్గంలో చేర్చుకోవడంతో తనకు నమ్మిన బంటుగా ఉన్న సుధాకర్‌నాయక్‌ను సీఎంగా ఆయనే ఎంపిక చేశారు. ఆ తర్వాత సుధాకర్‌నాయక్ శరద్‌పవార్‌కు దూరమై ప్రధాని పీవీకి దగ్గరయ్యారు. దీంతో సుధాకర్ నాయక్ ను సీఎం పీఠం నుంచి దించడానికి తగిన సమయం కోసం శరద్‌పవార్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఒక వ్యక్తికి ఒకే పదవి నినాదంతో కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా ఉన్న పీవీ పదవికి అర్జున్‌సింగ్ ఎసరు పెట్టారు. ఆయనతో శరద్‌పవార్ కూడా అంతర్గతంగా జతకట్టారు. ఒక వ్యక్తికి ఒక పదవి అనే పార్టీ నియమావళి నుంచి తనకు మినహాయింపు ఇచ్చేలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో తీర్మానం చేయించి అర్జున్‌సింగ్ ఎత్తుగడను పీవీ చిత్తు చేయగలిగారు. అర్జున్, శరద్ పవార్ల కదలికలపై మహారాష్ట్ర సీఎం గా ఉన్నా సుధాకర్‌నాయక్ ఎప్పటికప్పుడు పీవీకి ఉప్పు అందిస్తూ మరింత దగ్గరయ్యారు.
పవార్ వర్గీయులను ఒకొక్కరినీ తప్పిస్తూ వచ్చారు. దీంతో రగిలిపోయిన శరద్ పవార్ వర్గానికి బొంబాయి అల్లర్లు కలిసి వచ్చాయి. ఈ అల్లర్లకు సీఎం అసమర్థతే కారణమని, అతన్ని గద్దె దించాలని శరద్ పవార్ వర్గం పార్టీ అధినేత, ప్రధాని పీవీపై ఒత్తిడి పెంచింది. సుధాకర్ నాయక్ స్థానంలో తాను సూచించిన వ్యక్తినే సీఎం చేయాలని శరద్‌పవార్ పట్టుబట్టారు. శరద్ పవార్ సూచించే వ్యక్తిని మాత్రం సీఎం చేయొద్దని సుధాకర్‌నాయక్ పట్టుదలకు పోయారు. కొత్త సీఎంను ఎంపిక చేసే అధికారాన్ని పార్టీ అధినేత, ప్రధాని పీవీకి కట్టబెడుతూ మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది.
ఇక్కడ పీవీ చాణక్యనీతిని ప్రదర్శించారు. ఎవరూ ఊహించని విధంగా సుధాకర్‌నాయక్ స్థానంలో మళ్లీ శరద్ పవార్‌నే ముఖ్యమంత్రిగా ప్రకటించారు. దీంతో శరద్‌పవార్, సుధాకర్‌నాయక్ ఇరు వర్గాలకు కళ్లు బైర్లు కమ్మాయి. వీరిద్దరూ పీవీనా? మజాకా? అనక తప్పలేదు. గుడ్డిలో మెల్లగా తన పంతం నెగ్గిందని సుధాకర్‌నాయక్ తృప్తి చెందారు. తాను సీఎంగా పెట్టిన నాయక్ తోక కత్తిరించే అవకాశం తనకే దక్కిందన్న సంతృప్తితో శరద్‌పవార్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో తలపండిన నాయకులు సైతం దటీజ్ పీవీ అని మెచ్చుకోక తప్పలేదు. శరద్ పవార్ పన్నిన రాజకీయ ఎత్తుగడకు అతనే చిత్తు అయి చివరికి వచ్చిన సొంత రాష్ట్రం బాట పట్టక తప్పని పరిస్థితి కల్పించడం ద్వారా పీవీ రాజనీతికి నిదర్శనం.
– వెల్జాల చంద్రశేఖర్