నందికొండ, జూన్ 13 : నాగార్జునసాగర్ కుడి కాల్వ నిర్వహణ, భద్రత తామే చేపడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ తెలంగాణ రాష్ట్ర ఎస్పీఎఫ్ (ప్రత్యేక రక్షణ దళం) డీజీకి లేఖ ఇచ్చినట్టు సమాచారం. 2023 నవంబర్ 30న ఆంధ్రాపోలీస్ బలగాలు, అధికారులు నాగార్జునసాగర్ డ్యాంపైకి దౌర్జన్యంగా ప్రవేశించి, డ్యాం సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
డ్యాం 13వ గేట్ నుంచి 26వ గేట్ వరకు తమ ఆధీనంలో ఉంటుందని, ఆంధ్రకు నీటిని విడుదల చేసే కుడికాల్వ నిర్వహణ కూడా తామే చూసుకుంటామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కుడి కాల్వకు నీటి విడుదలను ఆంధ్రా అధికారులు చేపడుతున్నారు. డ్యాంపై నెలకొన్న ఉద్రిక్త వాతావరణం తొలగించడానికి, డ్యాంపై భద్రత చేపడుతున్న తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలను తొలగించి సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం ఏర్పాటు చేసింది.
డ్యాం 13వ గేట్ వరకు తెలంగాణ వైపు ఒక బెటాలియన్, 13వ గేట్ నుంచి 26వ గేట్ అవతలి వరకు ఆంధ్ర వైపు మరొక బెటాలియన్ను నియమించింది. సీఆర్పీఎఫ్ బలగాలు డ్యాంపై విధులు నిర్వహిస్తూ వస్తుండగా, ఏప్రిల్ నెలలో తెలంగాణ వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు విధులను ఉపసంహరించుకొని వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆంధ్ర వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు పూర్తిస్థాయిలో డ్యాంపైన విధులు చేపడుతూ వస్తున్నారు.
కేఆర్ఎంబీ సమక్షంలో రెండు తెలుగు రాష్ర్టాలతో జరిగిన సమావేశంలో ఆంధ్ర వైపు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు జూన్ నెలాఖరులోగా వెళ్లిపోతాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. వాస్తవానికి డ్యాంపై విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు వెళ్లిపోగానే డ్యాం భద్రత, నిర్వహణను తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలు చేపట్టాల్సి ఉంటుంది.