‘బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్‌కాట్’ అంటూ ముందురోజు పత్రికలకు లీకులిచ్చిన రేవంత్ .. అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లారేసరికి బాబుతో సమావేశమయ్యారు. ‘బనకచర్ల అనేదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా’ అని చెప్పిన ఏపీతో ఢిల్లీ వేదికగా చర్చలకు కూర్చున్నారు.. సమావేశంలో బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ అంటే.. దానిపైనే ప్రధానంగా చర్చించామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. మొత్తానికి బనకచర్ల వెనక బాబు ‘మతలబు’ నడిచింది. తెలంగాణ జలహక్కుల్ని రేవంత్ ఆంధ్రాకు ధారాదత్తం చేశారు. తెలంగాణ వెన్నులో వెచ్చని కత్తి దించేలా.. గూడుపుఠాని గుప్పున వాసనకొడుతున్నది.
ఎవడి జాగీరు? ఎవడబ్బ సొమ్ము?ఎవరు ఎవరికి దానం చేస్తున్నారు? ఎవరి తాత సొమ్మని ధారపోస్తున్నారు? ఇదేం బోడి పెత్తనం? ఇదేం రుబాబు? ఆరు దశాబ్దాల తెలంగాణ సాగునీటి స్వప్నాన్ని నిర్దాక్షిణ్యంగా నరికేసే హక్కు ఎవరిచ్చారు? మాయ చేసి నీళ్లు కాజేసేహక్కు పక్కోడికెవరిచ్చారు? ‘జీ హుజూర్’ అని సంతకాలు చేసే హక్కు కాంగ్రెస్‌కు ఎవరిచ్చారు? ఇది ఎవరు పోరాడితే వచ్చిన తెలంగాణ! ఇది ఎందరు బలిదానాలు చేస్తే వచ్చిన తెలంగాణ! పదవులకు రాజీనామా అని ఇండ్లలో ఫైళ్లమీద సంతకాలు చేసిన చీకటి నేతలు ఏ హక్కుతో తెలంగాణ హక్కులను బలిపెడుతున్నారు? తెలంగాణ ఉద్యమంలో పాత్రే లేని వాళ్లు ఏ హక్కు ఉన్నదని తెలంగాణ భవిష్యత్తును కూలదోస్తున్నారు? ఎవరినడిగి నదులను సాగనంపుతున్నారు? ఎవరి అనుమతి తీసుకొని సంతకాలు చేస్తున్నారు? ఇది ప్రజలు కోరారా? చట్టసభలు తీర్మానించాయా? ఇంతేనా?.. ఇక సరిహద్దులనైనా ఉంచుతరా? లేక వాటిని కూడా చెరిపేసి గుంటనక్కలన్నీ ఢిల్లీ నేతృత్వంలోమళ్లీ పళ్లికిలించి సమైక్యగీతం ఆలపిస్తాయా?
అయిపోయింది. తెచ్చుకున్న తెలంగాణ దారి తప్పిపోయింది. చేయి జారిపోయింది. స్వరాష్ట్రంలో పదేండ్ల పచ్చని పంటలు, సజీవ జలధారలు ఇక చరిత్ర మాత్రమే! ‘ఒక్క తప్పు చేస్తే వందేండ్లు నష్టపోతాం’ అన్న కేసీఆర్ ఎన్నికల మాట ఇప్పుడు అక్షర సత్యం కానున్నది. అనుభవంలోకి వస్తున్నది. భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ప్రజలదే. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆనాడు ఉద్యమించిన తెలంగాణ మరో స్వాతంత్య్రపోరాటానికి సిద్ధం కావాల్సిందే. దురహంకార పాలకుల మెడలు వంచి సంతకాలు అమలు కాకుండా ఆపాల్సిందే. ఢిల్లీ పాదుషాల కుట్రలను బద్దలు కొట్టాల్సిందే! ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఢిల్లీ వాడిది కాదు.. పక్కోడిది కాదు.. నడమంత్రపు సర్కారుది కాదు.. తెలంగాణ ప్రజలది.. రైతులది.. వారి బిడ్డలది! మనది! మనందరిది!
దూద్‌కా దూద్ పానీకా పానీ! తేలిపోయింది. మనిషి మనోడే కానీ మనసు మనది కాదని స్పష్టమైపోయింది. బనకచర్లపై చంద్రబాబు ఎత్తుగడ, నమ్మబలికి తెలంగాణను బలిచ్చిన రేవంత్ రెడ్డి మోసం, మధ్యవర్తిత్వం పేరుతో బీజేపీ చేసిన ద్రోహం ఢిల్లీ నడివీధుల్లో నగ్నంగా బట్టబయలైంది. ఆంధ్ర సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నడుమ బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మధ్యవర్తిత్వంలో అధికారికమో, అనధికారికమో తెల్వని ఒక సమావేశం జరిగింది. నదీ జలాలు, వివాదాలు, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన అనేక రాజ్యాంగబద్ధ సంస్థలున్నా అవేవీ ఇందులో పాల్గొనలేదు. కృష్ణా-గోదావరి జలాల వివాదాల పరిష్కారం కోసం కేవలం ఐదంటే ఐదే రోజుల్లో ఒక కమిటీని వేయాలని ఇందులో నిర్ణయించారు.
దశాబ్దాలయినా తేలని, ట్రిబ్యునళ్ల్లు, సుప్రీంకోర్టు, కేంద్ర జల సంఘం వంటివే దశాబ్దాలుగా పరిష్కరించలేని జల వివాదాలను ఈ కమిటీ కేవలం నెలరోజుల్లో పరిష్కరిస్తుందట! ‘మేము అపాయింట్ చేసిన కమిటీ కాబట్టి వాళ్లు ఎలాంటి సూచనలు చేసినా అమలుచేస్తాం’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తద్వారా ఈ మొత్తం వ్యవహారం అంతరార్థం ఏమిటంటే తెలంగాణ నీటిబొట్టును రేవంత్ ఆంధ్రాకు తాకట్టు పెట్టారు. బనకచర్లపై బాంచెన్ బాబూ అంటూ సాగిల పడ్డారు. తనకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకన్నా ఆంధ్రాబాబు ఆదరణే ముఖ్యమని చాటుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యి 18 నెలలు గడిచినా జై తెలంగాణ అనని, అనలేని ముఖ్యమంత్రి ఆంధ్రాతో మాత్రం ఎలాంటి వివాదాలూ ఉండొద్దని దండోరా వేస్తున్నారు.
అసలు బనకచర్ల అంశం
ఇవాల్టి ఎజెండాలోనే లేదు.
సమావేశపు చర్చనీయాంశాల్లో మొట్టమొదటి అంశంగా బనకచర్లే ఉన్నట్టు నిరూపించే ఎజెండా కాపీ ఇది.
బనకచర్లపై చర్చ జరగలేదు: రేవంత్ గోదావరిపై బనకచర్ల కడుతామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేం ఆపమని చెప్పడానికి. ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదనే ఎజెండాలో లేనప్పుడు, మేం ఆపమనే చర్చే రాదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద, తెలంగాణ రాష్ట్రం ప్రస్తావిస్తున్న కృష్ణా, గోదావరికి నీటి లభ్యతకు సంబంధించి.. రెండూ కూడా సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి, ఒక పరిష్కారం చూపేవిధంగా సాంకేతిక, పరిపాలన అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగింది. ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం బిల్డప్ చేసుకునేలా, పెద్దగా కాలయాపన లేకుండా సోమవారంలోపు కమిటీని ఏర్పాటు చేసుకుని, ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం.
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల నీటి వినియోగంపై అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అధ్యయనానికి సీనియర్ అధికారులు, నిపుణులతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ కమిటీ నదీ జలాలపై ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, ఇతర సమస్యలు అన్నింటిపైనా సమగ్రంగా అధ్యయనం చేసి 30 రోజుల్లోగా నివేదిక ఇస్తుంది. మేం అపాయింట్ చేసిన కమిటీ కాబట్టి వాళ్లు ఎలాంటి సూచనలు చేసినా అమలు చేస్తాం. రాష్ట్రాల మధ్య సమస్యలను పరిషరించుకోవడానికే మేం ఢిల్లీకి వచ్చాం. జటిలం చేసుకోవడానికి కాదు. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం మా బాధ్యత.
– సీఎం రేవంత్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో నా అంత సిపాయి లేడన్నడు.. ‘ఢిల్లీలో నీ పరపతి ఉంటే బనకచర్లను ఎట్ల అడ్డుకోవాల్నో నాకు తెలుసు’ అని చంద్రబాబుకు సవాళ్లు విసిరిండు. బనకచర్లపై మాట్లాడుకునేందుకు చంద్రబాబునే చర్చలకు పిలుస్తామన్నడు. కేంద్రంలో మద్దతిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌కు మొగ్గుచూపి తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని చివరికి ప్రధాని మోదీ మీద కూడా ఉరిమిండు. చర్చల కోసం కేంద్రం ఢిల్లీకి పిలిస్తే బనకచర్ల అంశంపై మాట్లాడేదే లేదన్నడు. బనకచర్ల కోసమే అయితే మేం రానే రామన్నడు. బనకచర్ల మాటెత్తితే ఉన్నపళంగా సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి బయటికొస్తమన్నడు. తీరా బుధవారం ఢిల్లీలో జరిగిన జల్‌శక్తి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబును ఆత్మీయంగా అలుముకొని బనకచర్ల పేపర్లపై సంతకాలు చేసిండు. బయటకొచ్చి ‘గోదావరిపై బనకచర్ల కడుతామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేం ఆపాలని చెప్పడానికి. ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదనే ఎజెండాలో రానప్పుడు, మేం ఆపమనే చర్చే రాదు’ అని బుకాయించిండు. రెండు రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కమిటీ వేయాలని భేటీలో నిర్ణయించగా ‘మేం అపాయింట్ చేసిన కమిటీయే కాబట్టి ఎలాంటి సూచనలు చేసినా అమలు చేస్తం’ అని జబ్బలు చరుచుకున్నడు.తెలంగాణ సమాజానికి నువ్వు చెప్పిందేంది.. ఢిల్లీకి పోయి చేసుకొస్తున్నదేంది రేవంత్‌రెడ్డీ? బనకచర్ల మీద కమిటీనా? ఎవరిని అడిగి ఒప్పుకొన్నవు? అసలు ఎవరితోనైనా చర్చించినవా? అసెంబ్లీలో చర్చకు పెట్టినవా? కనీసం కాంగ్రెస్ శాసనసభాపక్షమైనా ఏర్పాటు చేసి మాట వరుసకైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చెప్పినవా? అఖిలపక్షాన్ని పిలిచి ఏం చేద్దామని అడిగినవా? నీ గురువు చంద్రబాబు బనకచర్ల ప్రతిపాదన పెట్టి కమిటీ వేయాలంటే.. దానికి తలూపుతవా? తెలంగాణ నీటిబొట్టును చంద్రబాబుకు తాకట్టు పెట్టి వస్తవా? ఎంత దగా! ఎంత మోసం!!
ఏపీ నిర్మించతలపెట్టిన బనకచర్లను ఒప్పుకొనేదే లేదంటూ తెలంగాణను నమ్మించి గొంతుకోసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై తెలంగాణ సమాజం రగిలిపోతున్నది. రైతులు.. యువత.. మేధావులు.. ప్రతి ఒక్కరూ సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై మండిపడుతున్నారు. చంద్రబాబు తెలంగాణకు అంటించాలనుకున్న బనకచర్ల బంకను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని దాదాపు నెల రోజులుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు.. ప్రెస్మీట్లు.. కేవలం ఎంపీలతోనే అఖిలపక్షాన్ని నిర్వహించి హైడ్రామా నడిపించిన రేవంత్‌రెడ్డి, చివరికి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఏపీ సీఎం చంద్రబాబు ముందు కాడి పడేశారు. ప్రధానంగా ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతానంటూ కొన్నిరోజులుగా పదేపదే ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పుడు ఒక్కసారిగా కమిటీకి సై అనడమే కాదు.. ‘మనం వేసిన కమిటీ ఏది చెప్తే అది అంగీకరించాలి కదా!’ అని తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లొదలడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. కనీసం కేంద్ర మంత్రి సమక్షంలో చంద్రబాబు బనకచర్లను ప్రస్తావించగా.. ‘అనేక సాంకేతిక సవాళ్లు, చిక్కులతో కూడుకున్న ఈ ప్రతిపాదనలపై ఇప్పుడేం మాట్లాడలేం అనొచ్చు కదా!’ అని సగటు తెలంగాణవాది ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికి బనకచర్ల అనేది కేవలం ఆంధ్రప్రదేశ్-తెలంగాణకు సంబంధించినది కాదు.
నీళ్లలోంచి పుట్టిన తెలంగాణ ఉద్యమంతో సాకారమైన రాష్ట్రంలో కృష్ణాజలాల పంపిణీపై సెక్షన్-3 కింద ట్రిబ్యునల్ వేయాలని కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే కేంద్రానికి లేఖ రాసింది. కానీ తొమ్మిదిన్నరేండ్ల పాటు ఉలుకూపలుకూ లేని ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రబాబు అడిగిందే తడవుగా బనకచర్లకు మార్గం సుగమం చేస్తున్న తీరు సమైక్య స్ఫూర్తికే గొడ్డలి పెట్టుగా మారింది. బనకచర్లపై బాబు ప్రతిపాదన పెట్టగానే కేంద్రం నెల రోజుల్లో ఏకంగా కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించింది.
గోదావరి బేసిన్‌లోని ఏడు రాష్ర్టాల్లోని కోట్లాది మంది తాగు, సాగునీటితో ముడిపడి ఉన్న జీవన్మరణ అంశం. పైగా దేశ సాగునీటి రంగానికి సాంకేతికంగా కీలకమైన కేంద్ర జల సంఘం.. సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల్లో కీలక భూమిక పోషించే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ), తెలుగు రాష్ర్టాల పరిధిలోని గోదావరి బేసిన్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డుతో పాటు కేంద్ర జల్‌శక్తి ఆధీనంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఇలా నాలుగు అత్యంత కీలకమైన, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు బనకచర్లపై తీవ్ర సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనేక చిక్కుముళ్లు ఉన్నాయని కుండబద్దలు కొట్టాయి. కానీ బుధవారం జరిగిన సమావేశంలో ఈ నాలుగు సంస్థలకు చెందిన ఏ ఒక్క ప్రతినిధిని కూడా భాగస్వామిని చేయలేదు. పైగా బనకచర్లకు వ్యతిరేకంగా నివేదిక రూపొందించినందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న అళకేశన్పై వేటు వేసి హోదా తగ్గించి సభ్యుడిగా ఉత్తర్వులు ఇవ్వడం దేనికి సంకేతం? అంటే కేవలం బనకచర్లకు జై కొట్టకుంటే అధికార కొరఢా ఝుళిపిస్తామని చంద్రబాబు కేంద్రం ద్వారా హెచ్చరించడమే కదా.! బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఈ కేంద్ర సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలను ఉటంకించిన సీఎం రేవంత్ కూడా కనీసం బుధవారం భేటీలో ఈ సంస్థల ప్రస్తావన తీసుకువచ్చి ముందుకుపోవడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టకుండా కమిటీ వేద్దామన్నారంటే బనకచర్ల బంకను తెలంగాణకు రుద్దాలని నిశ్చయించుకున్నట్లే కదా!
బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతానంటూ కొన్నిరోజులుగా పదేపదే ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పుడు ఒక్కసారిగా కమిటీకి సై అనడమే కాదు.. ‘మనం వేసిన కమిటీ ఏది చెప్తే అది అంగీకరించాలి కదా!’ అని తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లొదలడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది.
నీళ్లలోంచి పుట్టిన తెలంగాణ ఉద్యమంతో సాకారమైన రాష్ట్రంలో కృష్ణాజలాల పంపిణీపై సెక్షన్-3 కింద ట్రిబ్యునల్ వేయాలని కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే కేంద్రానికి లేఖ రాసింది. కానీ తొమ్మిదిన్నరేండ్ల పాటు ఉలుకూపలుకూ లేని ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రబాబు అడిగిందే తడవుగా బనకచర్లకు మార్గం సుగమం చేస్తున్న తీరు సమైక్య స్ఫూర్తికే గొడ్డలి పెట్టుగా మారింది. బనకచర్లపై బాబు ప్రతిపాదన పెట్టగానే కేంద్రం నెల రోజుల్లో ఏకంగా కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించింది. ఐదు రోజుల్లోనే కమిటీని వేసి.. మరో నెల రోజుల్లోనే నివేదికను కూడా సిద్ధం చేయడమంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను బుల్డోజ్ చేస్త్తుంటే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి సహకరిస్తుండటం సగటు తెలంగాణవాది హృదయాన్ని కలచివేస్తున్నది. ఒకవైపు కృష్ణాజలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ కమిటీ కొనసాగుతుండగా.. చంద్రబాబుతో కలిసి కృష్ణా, గోదావరిజలాల అంశంపై మరో కమిటీని వేయడమంటే ఆరు దశాబ్దాలు దగాపడిన ఈ గడ్డను మళ్లీ ఎడారిగా మార్చాలనే కుట్ర కత్తులకు రేవంత్‌రెడ్డి తేనె పూస్తున్నట్టే కదా!
కేంద్ర జల సంఘం.. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డుతో పాటు కేంద్ర జల్‌శక్తి ఆధీనంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బనకచర్లపై తీవ్ర సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. సమావేశంలో ఈ నాలుగు సంస్థల భాగస్వామ్యం కూడా లేదు. కానీ బనకచర్లకు వ్యతిరేకంగా నివేదిక రూపొందించినందుకు గోదావరి యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న అళకేశన్ హోదా తగ్గించి సభ్యుడిగా ఉత్తర్వులు ఇవ్వడం దేనికి సంకేతం?
ఢిల్లీలో ముఖ్యమంత్రుల భేటీ ముగిసిందే తడవుగా మీడియాలో వస్తున్న సమాచారాన్ని చూసి రగిలిపోతున్న తెలంగాణవాదులు ‘నమస్తే తెలంగాణ’ కార్యాలయానికి ఫోన్ల మీద ఫోన్లు చేశారు. ఉమ్మడి రాజధాని ఉన్నపుడు కనీసం హైదరాబాద్‌లో ఉండేందుకు కూడా జంకిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణను ఎడారి చేసేందుకు చేసే కుట్రలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి భాగస్వామి అవుతుండటంపై భగ్గుమంటున్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ చివరి దశలో ఉన్నందున మున్ముందు రాష్ర్టానికి కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా దక్కుతుందనే ఆశాభావంతో ఉన్న తెలంగాణ రైతాంగం మీద పిడుగుపాటులా పడిన బనకచర్ల భవిష్యత్తు లేకుండా చేస్తుందని సాగునీటి రంగ నిపుణులో ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే… రాష్ర్టాన్ని సాధించుకొని కూడా కించిత్తు ప్రయోజనం ఉండదని గుండెలు బాదుకుంటున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమంలా మరో పోరాటానికి సిద్ధమైతే తప్ప ఈ కుట్రల్ని చేధించడం సాధ్యం కాదని పోరుబాటకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసిరాని అప్పటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లారా… ఇప్పుడూ కండ్ల ముందు తెలంగాణ గోదావరి నీటిబొట్టును చంద్రబాబుకు తాకట్టు పెడుతుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కండ్లప్పగించి చూస్తుండటం తెలంగాణ సమాజాన్ని బాధిస్తున్నది. లీలావతి హోటల్లో సీఎం రేవంత్ పక్కన కూర్చున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు కనీసం నోరెత్తి.. బాయ్‌కాట్ చేయాల్సిన సమావేశంలో కమిటీని వేయడమేంది? మనం వేసిన కమిటీ చెప్పింది మనం వినాల్సిందే కదా అని సన్నాయి నొక్కులు నొక్కడమేంది? అని ప్రశ్నించకపోవడం, కనీసం బేధాభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోవడం తెలంగాణ భవిష్యత్తును అంధకారం చేయడమేనని తెలంగాణవాదులు నిట్టూరుస్తున్నారు.