రాజోళి, ఏప్రిల్ 29 : తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, నిర్మాణ పనులకోసం జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తూర్పుగార్లపాడు శివారులో తుంగభద్ర నది వద్ద ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారికి ఇసుకను తరలించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
తూర్పుగార్లపాడు రీచ్ విషయంలో ఏపీ పోలీసులు.. స్థానికులకు మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నది. మంగళవారం తూర్పుగార్లపాడుకు చెందిన రెండు ట్రాక్టర్లు ఆన్లైన్ బుకింగ్‌తో తుంగభద్ర నదిలో దిగగా ఏపీ పోలీసులు, ఒక గ్రామానికి చెందిన వ్యక్తులు ట్రాక్టర్ డ్రైవర్లపై దాడి చేసి ట్రాక్టర్లను కర్నూల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ అనుమతులు ఉన్నా స్థానిక అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.