హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఏపీ సర్కారు మొండిచేయి చూపినట్టే కనిపిస్తున్నది. వర్సిటీకి బకాయిపడ్డ రూ.600 కోట్లు చెల్లించడం అనుమానమేనని విద్యావేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి నిధులు రాబట్టే విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మౌనం వహించడమే ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతున్నదని అధికారులు చెప్తున్నారు. అంబేద్కర్ వర్సిటీని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 10వ షెడ్యూల్లో చేర్చారు. చట్టం ప్రకారం పదేండ్ల పాటు తెలంగాణ ప్రభుత్వం 48శాతం, ఏపీ సర్కారు 52శాతం నిధులను వర్సిటీకి కేటాయించాలి.
కానీ ఇంతవరకు ఏపీ ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. ఇదే విషయంపై వర్సిటీ అధికారులు ఏపీ ప్రభుత్వానికి చాలాసార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. వర్సిటీకి ఏపీలో 76 స్టడీ సెంటర్లుండగా ఏటా 50వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. పదేండ్లుగా ఉద్యోగుల జీతాలు, పాఠ్యపుస్తకాలు, తరగతులు, పరీక్ష నిర్వహణ, సర్టిఫికెట్లు జారీ ఖర్చును తెలంగాణ ప్రభుత్వం, వర్సిటీ భరించింది. ఇందులో ఏపీ చెల్లించాల్సిన బకాయి మొత్తం రూ. 600 కోట్లుగా ఉంది. విభజన చట్టం ప్రకారం 2024-25 విద్యాసంవత్సరంతో గడువు ముగిసింది. ఇప్పటివరకు వర్సిటీ విభజన పూర్తికాలేదు.
ఈ నేపథ్యంలో ఏపీలోని విద్యార్థులకు ఏపీలోని వర్సిటీ ఉద్యోగులకు వేతనాలు, ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం వర్సిటీ హెడ్‌క్వార్టర్స్‌ను ఏలూరుకు తరలిస్తున్నట్టు వివాదాస్పద జీవో విడుదల చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారం వర్సిటీలు వాటి ప్రాదేశిక పరిధి(రాష్ట్రం)లోనే సేవలందించాలి. ప్రస్తుతం వర్సిటీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ లెక్కన వర్సిటీ హెడ్‌క్వార్టర్‌ను ఎలా మార్చుతారన్న ప్రశ్నలొస్తున్నాయి. తెలంగాణ సర్కారు నిర్లక్ష్యం చేయకుండా ఏపీ ప్రభుత్వం నుంచి బకాయిలు వసూలుకు చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నారు.