హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించిన కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విశాఖతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భంలో విద్యుత్తు లైన్లు వేసే కాంట్రాక్టును పొంగులేటికి చెందిన రాఘవ సంస్థకు ఏపీ ప్రభుత్వం 2022 డిసెంబర్లో అప్పగించింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1,194 కోట్లుగా అంచనా వేయగా, రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థకు రూ.1,599.93 కోట్లకు అప్పగించారు. అంచనా వ్యయం కన్నా అధిక వ్యయానికి కాంట్రాక్టును అప్పగించడంపై చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. కాంట్రాక్టు అప్పగించి ఏడాది గడిచినా ఇంకా పనులు ప్రారంభించకపోవడంపై రాఘవ సంస్థకు నోటీసులు జారీచేసింది. వెంటనే పనులు ప్రారంభించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యుత్తు పునర్వ్యవస్థీకరణ పథకం ప్రకారం పనులు పూర్తయితేనే కేంద్రం నుంచి నిధులు మంజూరవుతాయనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం తమ నోటీసులో వివరించింది.
ఏపీ ప్రభుత్వం భూగర్భ విద్యుత్తు లైన్ల పనులకు రూ.1,194 కోట్లు, రింగ్ మెయిన్ యూనిట్ పనులకు అదనంగా మరో రూ.314 కోట్ల అంచనా వ్యయంతో వేర్వేరుగా టెండర్లు పిలిచింది. అయితే మొదటిసారిగా పిలిచిన టెండర్ల కంటే రూ.343 కోట్లు అదనంగా పెంచడంతో దీనిపై 10 శాతం అదనంగా కోడ్ చేసిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ కాంట్రాక్టును దకించుకుంది. పనులు పూర్తయితే మంత్రి పొంగులేటి కంపెనీకి ఈపీడీసీఎల్ రూ.1285.94 కోట్లు చెల్లించనుంది. ఇది టెండర్ ధర కంటే రూ.91.94 కోట్లు అధికం. దీనికి రింగ్ మెయిన్ యూనిట్ పనులకు కేటాయించిన రూ.314కోట్లు కలిపితే మొత్తం రూ. 1599.94 కోట్లు అవుతుంది. అంటే 2022 డిసెంబర్లో పిలిచిన టెండర్ల ధరతో పోలిస్తే ప్రాజెక్టు విలువ 37.33 శాతం పెరుగుతుంది. ఈ మొత్తం విలువ రూ.434.94 కోట్లకు చేరుతుంది. ఇంత భారీస్థాయిలో ప్రజాధనాన్ని కంపెనీకి కట్టబెట్టినప్పటికీ పనులు మొదలుపెట్టలేదని, అందుకే ఈపీడీసీఎల్ సీరియస్‌గా వ్యవహరించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.