హైదరాబాద్, జనవరి21 (నమస్తే తెలంగాణ) : కృష్ణాజలాలను 66:34% నిష్పత్తిలో వినియోగించుకోవాలని 2015లో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు చేసుకున్నది తాత్కాలిక ఒప్పందమేనని, అదీ ఆ ఏడాదికే పరిమితమని రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తేల్చిచెప్పారు. నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 71%, ఏపీకి 29% జలాలను కేటాయించాలని ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు. ట్రిబ్యునల్ విచారణ పూర్తయ్యేవరకు ఈ ఏడాది నుంచి కృష్ణాజలాలను 50:50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని బోర్డుకు స్పష్టంచేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) 19వ సమావేశం హైదరాబాద్ జలసౌధలో మంగళవారం జరిగింది. బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ నేతృత్వంలో కొనసాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. బేసిన్ అవతలికి ఏ మేరకు కృష్ణాజలాలు తరలిపోతున్నాయో లెక్క తేల్చేందుకు 2వ దశలో 11 ఔట్లెట్లపై టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలని, అందుకు రూ.6 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని, ఆ నిధులను తొలుత భరించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని కార్యదర్శి రాహుల్‌బొజ్జా వెల్లడించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణను యథాతధ స్థితికి తేవాలని, తెలంగాణకు అప్పగించాలని బోర్డును కోరారు. శ్రీశైలం డ్యామ్ భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని ఈఎన్సీ అనిల్‌కుమార్ కోరారు.
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి గత ఒప్పందం మేరకు 66:34 నిష్పత్తినే కొనసాగించాలని ఏపీ తరఫున ఈఎన్సీ వెంకటేశ్వరరావు కోరారు. నీటివాటాల అంశంపై త్రిమెన్ కమిటీలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చైర్మన్ అతుల్‌జైన్ వెల్లడించారు. సమావేశంలో తెలంగాణ అధికారులు విజయభాస్కర్, విజయ్‌కుమార్, బోర్డు అధికారులు రఘునాథ్, శివశంకర్, శ్రీధర్, వేణు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.