హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి రబీ సీజన్లో అధిక నీటిని అక్రమంగా వాడుకుంటున్నదని, సత్వరమే జోక్యం చేసుకొని తెలంగాణ ప్ర యోజనాలను కాపాడాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. జాతీయ నీటిపారుదలశాఖ మంత్రుల సదస్సు రాజస్థాన్‌లో రెండు రోజులుగా కొనసాగుతున్నది.
సదస్సు ముగిసిన అనంత రం బుధవారం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, జల్‌శక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జితో మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర జల వివాదాలను సత్వరమే పరిషరించాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. సీతారామ, పాలమూరు – రంగారెడ్డితోపాటు తెలంగాణ నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులన్నింటికీ అనుమతివ్వడంతోపాటు, నిధుల సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు.
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదికను నెలాఖరులోగా కేంద్రం అందించనున్నట్టు వెల్లడించారు. నీటి వినియోగానికి సంబంధించి లెక్కలను తీసేందుకు టెలీమెట్రీ వ్యవస్థలను అమలు చేయాలని కోరారు. సాగర్, శ్రీశైలం ఆనకట్టల మరమ్మతులకు డ్రిప్ నిధులను వినియోగించాలని కోరారు. ఆయా అంశాలపై కేంద్ర మంత్రి, కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని మంత్రి వెల్లడించారు.