హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ద్వారా 200 టీఎంసీల కృష్ణా నీటిని తరలించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బనకచర్ల ద్వారా గోదావరి వరద జలాలనే తీసుకెళ్తున్నామని, తెలంగాణకు నష్టమేమీ లేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంటున్నారని తెలిపారు. దీనికి తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.
మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజూ 10 వేల క్యూసెకులను ఏపీ తరలించుకుపోతుంటే రాష్ట్రప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదావరి, కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించే కుట్రలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా ఒక నాయకుడికీ పట్టింపు లేదని మండిపడ్డారు.
బనకచర్లతో తెలంగాణకేం నష్టమని చంద్రబాబు మాట్లాడి మూడురోజులైనా ఒకరూ గట్టిగా స్పందించలేదని విమర్శించారు. ‘చంద్రబాబుతో బీజేపీ, రేవంత్ దోస్తీ చేస్తూ తెలంగాణకు మోసం చేస్తారా? బాబు, రేవంత్, బీజేపీ మధ్య లోపాయికార ఒప్పందం ఏమిటి? బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తినా మీకు చలనం కలగదా? కాంగ్రెస్, బీజేపీ తీరు తెలంగాణ తాగు, సాగునీటి రంగానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నది. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పడుతున్న ఆరాటం మీకెలాగూ అర్థం కాదు. కనీసం మీడియాలో వస్తున్న కథనాలను చూసైనా కదలండి. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వ జల దోపిడీని అడ్డుకోండి. కేంద్రాన్ని నిలదీయండి. రేవంత్ సహా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మౌనం వీడండి’ అని హరీశ్‌రావు హితవు పలికారు.
తెలంగాణ నీటి ప్రయోజనాలు రాష్ట్ర సరారుకు పట్టవా? ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే మొద్దు నిద్ర నటిస్తారా? నీటి చౌర్యంపై ఏపీ సీఎం చంద్రబాబును అడ్డుకునే ధైర్యం, కేంద్రాన్ని అడిగే దమ్ము.. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదా?
– హరీశ్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతగానితనం వల్లే ఉమ్మడి పాలన నాటి తాగునీటి గోస మళ్లీ ఇప్పుడు తెలంగాణలో చూడాల్సిన దుస్థితి దాపురించిందని హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగునీటి కోసం పడుతున్న కష్టాలపై శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. వ్యవసాయ బావి నుంచి గ్రామస్థులు బిందెలు, బకెట్ల ద్వారా నీటిని మోసుకొస్తున్న ఫొటోలను పోస్టు చేశారు.
‘ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను సీఎం రేవంత్‌రెడ్డి వల్ల మళ్లీ చూస్తున్నాం. మిషన్ భగీరథ నీటి సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ విఫలమైంది. ఇది వేసవిలో మారుమూల గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. భుజాలుకాయలు కాసేలా బిందెలు మోస్తూ, వాగులు, వ్యవసాయ బావుల నుంచి నీళ్లు తెచ్చుకునే దుస్థితిని కల్పించింది. పథకాలు అమలులో వైఫల్యం. పరిపాలనలో వైఫల్యం. చివరకు కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అని హరీశ్‌రావు ఫైరయ్యారు.