CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో అనుబంధాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి బయటపెట్టుకున్నారు. 24 గంటల విద్యుత్తుకు ఆద్యుడు చంద్రబాబునాయుడేనని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ తర్వాతే వైఎస్ఆర్ దానిని అమలు చేశారని చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. విద్యుత్తు రంగంపై సోమవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ ‘వాళ్లేదో (బీఆర్ఎస్) తెలంగాణకు విద్యుత్తు వెలుగులు తెచ్చినట్టు చెప్తున్నారు.
తెలంగాణ ధగధగా మెరిసిపోతున్నట్టు ఎంతకాలం ఊదరగొడతారు? తెలంగాణకు, హైదరాబాద్‌కు పెట్టుబడులు తీసుకురావాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విస్తరించారు. ఐటీ కంపెనీలు, హైదరాబాద్‌కు విద్యుత్తు కోతలు లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల అన్ని ఇండస్ట్రీలు ఈ నగరానికి వచ్చాయి. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న 24 గంటల విద్యుత్తుకు ఆద్యుడు చంద్రబాబు ఆదాయంలో అధిక భాగం నాడు యూపీఏ-1,2లో తీసుకున్న నిర్ణయాలే కారణం’ అని తెలిపారు.
నాడు బీహార్ నుంచి జార్ఖండ్ విజన్ సందర్భంగా 42% ఉన్న జనాభాకు 42శాతం విద్యుత్తు వినియోగం ఇచ్చారని, అదే పద్ధతిలో తెలంగాణకు కూడా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం, ఏ ప్రాంతంలో విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయో అవి ఆ ప్రాంతానికే ఇచ్చే వెసులుబాటు చట్టంలో ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారని, దీంతో ఇక్కడి కాంగ్రెస్ నాయకులు నాటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో మాట్లాడరని తెలిపారు.
ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా వినియోగం ప్రాతిపదికన విద్యుత్తు పంపిణీ జరగాలని జైపాల్‌రెడ్డి.. అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, సోనియాతో మాట్లాడించి స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించారని చెప్పారు. ఆ విధంగా తెలంగాణకు 53.46 శాతాన్ని ఇప్పించారని, ఆయన కృషి ద్వారానే తెలంగాణకు చీకట్లు తొలగాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. సోనియమ్మ దయ, జైపాల్‌రెడ్డి కృషి వల్లే తెలంగాణ విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కిందని తెలిపారు. ‘నాడు 7వేల మెగావాట్ల విద్యుత్తు ఉంటే, నేడు 19వేల మెగావాట్లకు తీసుకెళ్లామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎవరి ఉత్పత్తి చేశారు? వీరు చేశారా? వీళ్ల తాతలు ఉత్పత్తి చేశారా?’ అంటూ పదేండ్ల బీఆర్ఎస్ కష్టాన్ని కొట్టిపారేశారు.