Chandrababu Naidu | హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ… ఆంధ్రప్రదేశ్.. తనకు రెండు కండ్లలాంటివి అన్న చంద్రబాబుకు రెండు నాల్కలు ఉన్నట్టుంది! అందుకే గోదావరి జలాల వాడకంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. నిన్నటిదాకా గోదావరిపై తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులపై పడి ఏడ్చిన చంద్రబాబు ఇప్పుడు తాను చేపట్టే బనకచర్లపై ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. ఏటా సముద్రంలో రెండు వేల టీఎంసీల వరకు వృథాగా కలుస్తున్న గోదావరి జలాలను వాడుకుంటే తప్పేమిటని బుకాయిస్తున్నారు. కానీ, ఇదే చంద్రబాబు తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి చిన్న లిఫ్టు స్కీం అయిన భక్తరామదాసు వరకు తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎడాపెడా ఫిర్యాదులు చేశారు.
గోదావరి బోర్డు నుంచి కేంద్రం వరకు కొర్రీలు పెట్టి మరీ ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ ప్రతి గడప ఎక్కారు. అనేక వేదికలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి కేసులు కూడా వేయించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తనకు హక్కుభక్తుంగా ఉన్న నీటి కేటాయింపుల్లో నుంచే గోదావరిపై ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. వీటిపైనే అభ్యంతరాలు వ్యక్తంచేసిన చంద్రబాబు… ఇప్పటికే కేటాయింపులకు మించి గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా, అదనంగా బనకచర్లపై నీతి సూత్రాలు వల్లిస్తుండటంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది.
తెలంగాణ ఏర్పాటు తరువాత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టు ముందుకు కొనసాగకూడదనే దూరాలోచనతో నీటి లభ్యత లేనిచోట, అభయారణ్యం, అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తుతాయని తెలిసినా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఉమ్మడి పాలకులు ప్రతిపాదనలు చేయడం, ఆ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కేసీఆర్ ఆ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేయడం తెలిసిందే. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని చెప్తున్న సీఎం చంద్రబాబు నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదంటూ కేంద్ర జల్‌శక్తి శాఖకు, కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) లేఖలు రాశారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే ముందస్తు అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఉటంకిస్తూ అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టిన ప్రాజెక్టు అయినప్పటికీ కాళేశ్వరంపై గగ్గోలు పెడుతూ ఫిర్యాదులు చేశారు. ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులోనూ ప్రాజెక్టుపై కొర్రీలు పెడుతూ వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు మంజూరు చేయగా, టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) తుది అనుమతులు జారీ చేసే తరుణంలోనూ 2018లో లేఖ రాశారు. ప్రాజెక్టుపై ప్రతి దశలోనూ మోకాలడ్డుతూ వచ్చారు.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను ఎన్టీఆర్ తరహాలోనే దత్తత తీసుకున్నారు. తీరా జిల్లాకు చేసిందేమైనా ఉన్నదా అంటే శూన్యం. పాలమూరు కరువు, వలసల పేరు చెప్పుకుని ప్రపంచబ్యాంకు రుణాలను పొందారు తప్ప అందులో ఒక్క పైసా కూడా అక్కడి ప్రాజెక్టులకు ఖర్చుచేయలేదు. కానీ, అంతకు మించి విద్రోహాన్ని తలపెట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరమూ అదే వివక్షను కొనసాగించారు. అంతేకాదు, కేసీఆర్ సర్కారు శ్రీశైలం జలాశయం నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీల వరద జలాలను ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో కలిపి మొత్తంగా 12,30,000 ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) శ్రీకారం చుడితే ఓర్వలేకపోయారు.
ఇది కూడా గతంలో ఉమ్మడి పాలకులు అనుమతులు మంజూరు చేసిన ప్రాజెక్టే! అయినప్పటికీ, దానిని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదంటూ 2015 జూన్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ సర్కారుతో లేఖ రాయించారు. సీడబ్ల్యూసీకి స్వయంగా ఫిర్యాదు చేశారు. అంతేకాదు, నాటి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ఉమాభారతికి 2016లో ప్రత్యేకంగా లేఖ రాశారు. పాలమూరు ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయించారు. అటు తరువాత స్థానిక రైతులను, అనుయాయులను ప్రోత్సహించి ఎన్జీటీలో కేసులు వేయించి ప్రాజెక్టును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
ప్రాజెక్టు పనుల్లో తెలంగాణ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదంటూ ఎన్జీటీలో ఏపీకి చెందిన రైతులు పిటిషన్ దాఖలు చేయగా, అందులో పనిగట్టుకుని చంద్రబాబు సర్కారు ఇంప్లీడ్ అయ్యింది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల్లోనూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ ఎక్కడాలేని అభ్యంతరాలను లేవనెత్తింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని లేఖలో ఫిర్యాదు చేసింది. అంతేకాదు, సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది.
గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును రూ.80వేల కోట్లతో ఏపీ చేపట్టిన విషయం తెలిసిందే. నీటిలభ్యత లేదని చెప్తూనే 200 టీఎంసీలను గోదావరి నుంచి పెన్నాబేసిన్‌కు మళ్లించేందుకు సిద్ధమయ్యారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని, బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించి మరీ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు దూకుడుగా ఏపీ సీఎం చంద్రబాబు ముందుకుసాగుతున్నారు. నిధుల సమీకరణకు అమరావతి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేశారు. త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
అయినప్పటికీ, ఈ జీబీ లింక్ ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదంటూ బాబు నేడు చిలుక పలుకులు పలకడమే విడ్డూరం. జీబీ లింక్ ఇంట్రా రివర్ లింక్ ప్రాజెక్టని, వందేండ్ల సగటును తీసుకున్నా రెండువేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, అలా పోయే 200 టీఎంసీల మిగులు జలాలను కరువు ప్రాంతాలకు తరలిస్తున్నామని, దీనిపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏ రాష్ర్టానికీ లేదని, అందరితో మాట్లాడుతామని చెప్పుకొస్తున్నారు. ఇది చంద్రబాబు రెండు నాల్కల ధోరణికి అద్దంపడుతున్నది.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులనే కాదు తెలంగాణ ప్రాజెక్టులన్నింటిపైనా చంద్రబాబు అడుగడుగునా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రతీ ప్రాజెక్టుపై, ప్రతీ వేదికపై తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరుచేసి అటకెక్కించిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించినా కూడా కొత్త ప్రాజెక్టులంటూ గగ్గోలు పెట్టారు. నల్లగొండ జిల్లాకు సంబంధించిన దిండి (నక్కలగండి) ప్రాజెక్టు, ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల లిఫ్ట్, ఖమ్మం జిల్లాలో చేపట్టిన భక్తరామదాసు లిఫ్ట్ స్కీమ్, సమీకృత సీతారామ సీతమ్మసాగర్, దేవాదుల ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు చేపట్టిన సమ్మక్కసాగర్ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేశారు.
నీటిలభ్యత లేదంటూ, ఏపీకి నీరే అందకుండా పోతుందని చెప్తూ, అనుమతులు ఇవ్వకూడదంటూ సీడబ్ల్యూసీకి లేఖలు రాశారు. రివర్ బోర్డులకు ఫిర్యాదులు చేశారు. ఆఖరికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కారు జలవిద్యుత్తు ఉత్పత్తిని కూడా చేపట్టకుండా చూడాలంటూ కేంద్రానికి అనేకమార్లు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతీ వేదికపైనా తెలంగాణ ప్రాజెక్టులపై వ్యతిరేకతను చాటుకున్న చరిత్ర చంద్రబాబుది.
ఏపీ సీఎం చంద్రబాబు చర్యలన్నింటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు వత్తాసు పలుకుతున్నది. తెలంగాణ హక్కులకు గండి కొడుతున్నది. తీరని విద్రోహాన్ని తలపెడుతున్నది. సెక్షన్-3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసి, నదీ జలాల పునఃపంపిణీ చేపట్టాలని స్వరాష్ట్ర ఏర్పాటు నుంచీ తెలంగాణ సర్కారు, అప్పటి సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. మరోవైపు, నికర జలాలు ఉన్న ప్రాజెక్టులకే అనుమతులు ఇచ్చేలా కేంద్రం కొత్తగా సీడబ్ల్యూసీ మార్గదర్శకాలనూ రూపొదించింది.
అక్కడితో ఆగకుండా రివర్ బోర్డుల గెజిట్‌ను విడుదల చేసి అందులో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చి మరో విద్రోహానికి పూనుకున్నది. అప్పటికీ బీజేపీ ఏమైనా ఊరుకున్నదా అంటే అదీ లేదు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ డీపీఆర్‌ను, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను సైతం పరిశీలన జాబితా నుంచి తొలగించింది. నిధుల విషయంలో చూపుతున్న వివక్షను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.