హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) దావోస్ వేదికగా పొగడ్తల వర్షం కురిపించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తమకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయన టెక్నాలజీ ఐకాన్ అంటూ ఆకాశానికెత్తేశారు. దావోస్‌లో పర్యటనలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు భారత్ తరఫున మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి దావోస్ సదస్సుకు హాజరయ్యాం. చాలా ప్రోత్సాహకరంగా సమ్మిట్ కొనసాగుతున్నది. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. మన దేశానికి పెట్టుబడులు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. పెట్టుబడులు రాబట్టడంలో మహారాష్ట్ర అందరికంటే ముందుంది. పెట్టుబడుల ఆకర్షణలో ఆ రాష్ట్రంతో పోటీపడతాం.
పారిశ్రామిక రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్నది. ఐటీ రంగంలో అగ్రగామిగా అవతరించబోతున్నది. వ్యవసాయం, డెయిరీలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. వన్ ట్రిలియన్ ఎకానమీగా మారడమే తెలంగాణ లక్ష్యం. గతేడాది వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలలో 80 శాతం ప్రోగ్రెస్ ఉంది. ప్రపంచ స్థాయి కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం. ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు మాకు స్ఫూర్తి. చంద్రబాబు టెక్నాలజీ ఐకాన్ అని చెప్పారు.
కాగా, దేశీయ టెక్ దిగ్గజం విప్రో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో కొత్త సెంటర్ ఏర్పాటుకు సంస్థ ముందుకువచ్చారు. మూడేండ్లలో దీనిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొత్త సెంటర్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో మరో 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఒకేరోజు 56 వేల కోట్ల పెట్టుబడులు..
దావోస్‌లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా తెలంగాణ రాష్ర్టానికి రూ.56,300 కోట్ల పెట్టబడులకు సంబంధించిన ఒప్పందాలు బుధవారం జరిగాయి. వీటిలో సన్ పెట్రోకెమికల్స్ సంస్థ రూ.45,500 కోట్లతో రాష్ట్రంలో భారీ పంప్ స్టోరేజ్ జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అలాగే కంట్రోల్ ఎస్ డాటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ రూ.10 వేల కోట్లతో హైదరాబాద్‌లో అత్యాధునిక ఏఐ (కృత్రిమ మేథ) డాటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్.. హైదరాబాద్‌లో కొత్తగా టెక్ సెంటర్, రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్టు అమెరికాకు చెందిన జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రకటించాయి. ఇందుకోసం రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నది. తెలంగాణ ప్రభుత్వంలో కుదిరిన ఆయా ఒప్పందాల ద్వారా సుమారు 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.