రాజీపడే ప్రసక్తే లేదు ఆంధ్రప్రదేశ్ నీటిహక్కులు, ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడంతోపాటు, కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి తీరుతాం.
– ఏపీ సీఎం చంద్రబాబు (2026 జనవరి 9)
ఏపీతో చర్చలకు సిద్ధం జలవివాదాలపై ఏపీతో చర్చలకు మేము సిద్ధం. చర్చలతోనే వివాదాలకు పరిష్కారం లభిస్తుంది.
– సీఎం రేవంత్ (2026 జనవరి 9న రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో)
నదీజలాలను తరలించేందుకు చంద్రబాబు మొండిపట్టుతో ముందుకు పోతుంటే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం బేలతనం ప్రదర్శిస్తున్నదని చెప్పడానికి ఒకేరోజు రెండు రాష్ర్టాల సీఎంలు చేసిన ఈ ప్రకటనలే సాక్ష్యం.
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టు అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లమల సాగర్ పేరుతో కొత్త అవతారం ఎత్తారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మంతనాలు సాగిస్తున్నారు. ఇదేసమయంలో పొరుగు రాష్ట్రం జలకుట్రలను తిప్పికొట్టి, తెలంగాణ నీటి హక్కులను, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బేషరతుగా ధిక్కరించాల్సిన రేవంత్ ప్రభుత్వం మాత్రం పూటకో తీరుగా వ్యవహరిస్తున్నది. చెప్పేదొకటి చేసేదొకటిగా మారింది. మొదట గోదావరిలో వెయ్యి టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలను తెలంగాణకు రాసిస్తే సరిపోతుందని, ఆ తరువాత బనకచర్లను అంగీకరిస్తామని ఏకంగా సీఎం రేవంత్ప్రకటించారు.
తీవ్ర విమర్శలు రావడంతో బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొంటామంటూ మాట మార్చారు. ఆ మాట మీద కూడా నిలబడలేదు. వరదజలాల లెక తేలాక, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకొన్నతర్వాత బురద ఉందా, వరద ఉందో తేలుతుందని, ఎవరేం కట్టాలంటున్నారనేది గోదావరి రివర్ బోర్డు ముందే చర్చిద్దామంటూ చర్చలకు ఆహ్వానం పలికారు. ఆ తర్వాత ఏపీ సర్కార్‌తో చర్చలకు మొగ్గుచూపడం, ఢిల్లీకి వెళ్లడం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో బనకచర్లపై చర్చే లేదని చెప్పి, తీరా జలవివాదాల పరిష్కారం కోసం నిపుణుల క మిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపిరావడం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిదర్శనం.
ఆ తర్వా త ఏపీ మంత్రి మాటలతో అదీ వట్టిదేనని తేలిపోయింది. పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టు ను చేపడుతున్నట్టు ఏపీ సీఎం పత్రికాముఖంగా ప్రకటించినా రేవంత్ స్పందించలేదు. కేంద్రానికి, న్యాయపర వేదికలపై ఫిర్యాదు చేసిన తరువాత సుప్రీంకోర్టుకు పోవాల్సి ఉం టుందని సుద్దులు చెప్పారు. కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకోవడం, ఏపీ టెండర్లను పూర్తి చేసేవరకూ ఎదురుచూసి, ఆ తరువాత సుప్రీంకోర్టు లో కేసు వేయడం.. ఇదీ రేవంత్ ప్రభుత్వం వరుస. మొత్తంగా ఏపీ సర్కార్, కేంద్ర ప్రభు త్వం కుట్రలకు వంతపాడుతున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.