హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూముల వివాదం కాంగ్రెస్ పార్టీలో ఇంటిపోరుకు తెరలేపినట్టు తెలుస్తున్నది. అటు అధిష్ఠానం పంపిన దూతకు, రాష్ట్రంలోని ముఖ్యనేతకు మధ్య ఈ అంశం చిచ్చురేపినట్టు సమాచారం. హెచ్‌సీయూ భూముల నుంచి ఏదో ఆశించిన ఇద్దరు ప్రభుత్వ ముఖ్యుల ఎత్తుగడలకు ఇప్పటికే విద్యార్థులు, మీడియా, కోర్టులు తపోభంగం కలిగించాయి. దీనికితోడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తనకు అత్యంత విశ్వసనీయంగా ఉండే మీనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దింపి మొత్తం వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో మీనాక్షి నటరాజన్‌ను తన దారిలోకి తెచ్చుకొనేందుకు ముఖ్యనేత పావులు కదుపుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే ముఖ్యనేతకు అనుకూలంగా ఉన్న మీడియాలో మీనాక్షి నటరాజన్‌కు వ్యతిరేకంగా జోరుగా వార్తలు ప్రచురితమవుతున్నాయి.
ఇద్దరి మధ్య హెచ్‌సీయూ చిచ్చు
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకం జరిగిన నాటి నుంచే ముఖ్యనేతకు ఆమెతో పొసగడం లేదని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇప్పుడు వీరిద్దరి వైరానికి హెచ్‌సీయూ వివాదం తోడైంది. ఇప్పుడు ఈ వివాదం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ ‘ఆదాయానికి’ గండి కొట్టిందని ఒకరు.. పార్టీ పరువును గంగలో కలిపారంటూ మరొకరు ఇలా ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నట్టు పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అధిష్టానం పేరు చెప్పి ఆమె.. స్థానిక పేరు చెప్పి ముఖ్యనేత ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అధిష్ఠానం దూతగా మీనాక్షి మంత్రులు, అధికారులతో సమీక్షలు చేయడం, సమావేశాలు పెట్టడంపై ముఖ్యనేత తీవ్రంగా మండిపడుతున్నట్టు సమాచారం.
అధిష్ఠానం దూతపై ఆగ్రహం
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను అగ్గువకే అమ్మేసి వేల కోట్లు కొల్లగొట్టాలని ప్రభుత్వంలోని ఓ ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ కుట్రలో భాగంగానే భూమి విలువను తగ్గించి.. ఇక్కడే రూ.10వేల కోట్లు కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేసినట్టు సమాచారం. వీరు తమ పథకాన్ని అమలులో పెడుతుండగానే అటు విద్యార్థులు, ఆపై న్యాయస్థానాలు అడ్డుకున్నాయి. దీంతో వారి ఆదాయానికి భారీ గండి పడింది. దీంతో ఇద్దరిలో ముఖ్యనేతకు ఫ్రస్ట్రేషన్ పీక్ చేరిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ కోపంతోనే సదరు నేత సినిమా వారి మీద, సొంత పార్టీ నేతలపైన బూతు పురాణం ఎత్తుకున్నట్టు చెప్తున్నారు. దీనికితోడు మీనాక్షి నటరాజన్ వ్యవహారం తమ కాళ్లకు బంధం వేసినట్టు భావిస్తున్న ముఖ్యనేత ఆమెతో తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధమైనట్టు గాంధీభవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా తమ పనితీరును ఆమె ప్రశ్నించడం, విమర్శలు చేయడం ముఖ్యనేతకు మింగుడుపడటం లేదని పేర్కొన్నాయి. ఆమె వ్యవహారం తనకు చెడ్డపేరు తెచ్చేదిగా ఉందని ముఖ్యనేత భావించడమే ఇందుకు కారణమని అంటున్నారు. దీంతో ఆమెకు చెక్ పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.
అనుకూల పత్రికల్లో వ్యతిరేక ప్రచారం!
మీనాక్షి నటరాజన్ తమ ఆదాయానికి గండి కొట్టిందని రగిలిపోతున్న ముఖ్యనేత ఆమెపై వ్యతిరేక ప్రచారానికి తెరలేపినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో మీనాక్షిపై వ్యతిరేక వార్తలు రాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ పత్రికల్లో వరుసగా రెండు రోజులు మీనాక్షికి వ్యతిరేకంగా కథనాలు వెలువడటమే ఇందుకు నిదర్శనం. ఓ కథనం ఆమెను ఏకంగా సూపర్‌బాస్‌గా పేర్కొనగా, మరో కథనం రాష్ట్రంపై ఢిల్లీ అధిష్ఠానం పెత్తనం తెలుగు ఆత్మగౌరవానికి అవమానంగా వర్ణించడం గమనార్హం.