మెట్రో టేకోవర్‌లో ఇది తాజా ట్విస్ట్! ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం మంజూరుకు రూ.84 కోట్లను ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. కానీ ఐఆర్ఎఫ్సీ మాత్రం ‘జీరో ప్రాసెసింగ్ ఫీజు’ అని అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో తేటతెల్లం చేసింది. అలాంటి ఫీజేమీ లేదని కుండబద్దలు కొట్టింది. ఇంతకీ… సీఎం చెల్లించామని చెప్తున్న రూ.84 కోట్లు ఎక్కడికిపోయినట్టు?! పైగా, ఐఆర్ఎఫ్సీ రుణం, ఇతరత్రా అవసరాలకుగాను అడ్వయిజర్‌గా వ్యవహరిస్తున్న ఐడీబీఐ క్యాపిటల్‌కు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ రూ.176 కోట్లు కూడా చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఐఆర్ఎఫ్సీ నుంచి వస్తుందనుకున్న రూ.13,527 కోట్ల రుణం కథ ఇక ఒడిసినట్టేనని ముఖ్యమంత్రి మాటలను బట్టి అర్థమవుతున్నది. అటు రూ.84 కోట్లు ఎటుపోయాయో తెలియక.. ఇటు రాని రుణానికి రూ.176 కోట్లు ఐడీబీఐకి అప్పగించి.. చివరికి సర్కార్ సాధించిందేంది? ఆ రూ.260 కోట్ల ప్రజాధనానికి బాధ్యులెవరు?!
హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): మెట్రో టేకోవర్‌కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం- ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) మధ్య కుదిరిన రుణ ఒప్పందంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.84కోట్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం మొదలుకొని.. అడ్వైజరీ కన్సల్టెన్సీకి రూ.176 కోట్లు చెల్లింపుల వరకు మొత్తం ప్రక్రియలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దానికితోడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నదానికీ, కేంద్రం ఆధీనంలోని ఐఆర్ఎఫ్సీ చెప్తున్నదానికీ మధ్య పలు అంశాల్లో పొంతన కుదరకపోవడం అనుమానాలను మరింత పెంచుతున్నది. గతనెల 25వ తేదీన ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం, ఐఆర్ఎఫ్సీ మధ్య జరిగిన మెట్రో రీఫైనాన్స్ ఒప్పందం జరిగింది. ఆ రోజు ఢిల్లీలో కేవలం తెలంగాణ ప్రభుత్వం తరపున విడుదల చేసిన పత్రికాప్రకటన మాత్రమే మీడియా ప్రతినిధులకు చేరింది. కానీ ఐఆర్ఎఫ్సీ అధికారికంగా రిలీజ్ చేసిన పత్రికాప్రకటన మాత్రం మీడియాకు అందలేదు. పత్రికాప్రకటనను రూపొందించి కూడా ఐఆర్ఎఫ్సీ మీడియాకు దానిని ఎందుకు పంపిణీ చేయలేదు? దాన్ని నేరుగా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌కు ఎందుకు పంపింది? ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పత్రికాప్రకటనలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడినట్టుగా ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అయితే ఇంచుమించు ఆ వివరాలే ఐఆర్ఎఫ్సీ రూపొందించిన పత్రికాప్రకటనలోనూ ఐఆర్ఎఫ్సీ సీఎండీ, సీఈవో మనోజ్‌కుమార్ దూబే పేరిట పేర్కొనబడి ఉన్నాయి. కానీ ఐఆర్ఎఫ్సీ ప్రకటనలో అత్యంత కీలకమైన ‘ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, కమిట్మెంట్ ఛార్జీలు లేదా ముందస్తు జరిమానాలు ఉండవు’ అనే పేరా మాత్రం తెలంగాణ ప్రభుత్వ ప్రకటనకు వచ్చేసరికి ఎగిరిపోయింది! అంటే తెలంగాణ సమాజానికి ఈ రీఫైనాన్స్లో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదనే వాస్తవం తెలియనీయకుండా దాచిపెట్టారా? అందుకోసమే ఐఆర్ఎఫ్సీ ప్రకటనను కూడా ఢిల్లీలో బయటకు రిలీజ్ చేయకుండా ఆపేయించారా? ఎవరు, ఎందుకు ఆ విషయాన్ని దాచిపెట్టారు? అసలు ఐఆర్ఎఫ్సీ పత్రికాప్రకటన బయటకు ఎందుకు రాలేదు? ప్రాసెసింగ్ ఫీజు లేదని ఐఆర్ఎఫ్సీ అధికారికంగా చెప్తున్నా.. సీఎం రేవంత్ రూ.84 కోట్లు ఆ రూపంలో చెల్లించామని మీడియా ముందు ఎలా చెప్పారు? అంటే రూ.84 కోట్ల ఫీజు ఎక్కడికి పోయినట్టు?! ఎవరికి చేరినట్టు?!
గత నెల 25న ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో మెట్రో రీఫైనాన్స్‌పై ఒప్పందం జరిగిన తర్వాత ఐఆర్ఎఫ్సీ ఆ రోజే అధికారిక పత్రికా ప్రకటనను తన వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టు తెలిసింది. అయితే ఐఆర్ఎఫ్సీకి నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ)ల్లో షేర్లు ఉన్నాయి. ఆ మేరకు ఆ సంస్థ ఏదైనా రుణాలు ఇచ్చినపుడు ఒప్పందాలు పూర్తికాగానే ఆ వివరాల్ని ఎన్ఎస్ఈ, బీఎస్ఈకి పంపుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంతో మెట్రోపై జరిగిన ఒప్పందం మేరకు సెబీ అనుమతితో పత్రికాప్రకటన సహా వివరాలను రెండు స్టాక్ ఎక్సేంజీలకు ఐఆర్ఎఫ్సీ పం పింది. అంటే రూ.13,527 కోట్ల రుణంపై ఐఆర్ఎఫ్సీ ఈ స్థాయిలో ముందడుగులు వేసింది. కానీ ప్రస్తుతం ఆ సంస్థ వెబ్సైట్లో పత్రికాప్రకటన మాయమైంది. అంటే ఐఆర్ఎఫ్సీ వెనక్కి తగ్గిందా? లేకపోతే పత్రికా ప్రకటన (ప్రాసెసింగ్ ఫీజు లేదు అనే) ఎవరికీ అందుబాటులో ఉండకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయి తే మంగళవారం రాత్రి వరకు కూడా ఎన్ఎస్ఈ వెబ్సైట్లో ఆ పత్రికాప్రకటన అందుబాటులో ఉన్నది.
మే 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం, ఐఆర్ఎఫ్సీ మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి ఐఆర్ఎఫ్సీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చివరన.. మీడియా సంబంధిత సందేహాలకు సంప్రదించాలంటూ తమ సంస్థ ప్రతినిధులిద్దరి పేర్లు, ఫోన్నెంబర్లను ప్రచురించారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం సాయంత్రం వారిని సంప్రదించింది. అందులో ఒకరైన రణ్‌విజయ్‌సింగ్ అసలు తనకు ఈ రీఫైనాన్స్ ప్రక్రియ గురించిగానీ, రుణం నిలిచిపోయిన విషయంగానీ ఏమీ తెలియని దాటవేశారు. తాను సుదీర్ఘ సెలవుపై వెళ్లానని, ప్రస్తుతం బీహార్‌లో ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. మరో ప్రతినిధి దివ్యాంశ్ ఉపాధ్యాయను సంప్రదించగా… ‘అసలు ఆ పత్రికా ప్రకటన మీకెలా దొరికింది?’ అని ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఎలాగోలా సంపాదించామని, ఇంతకీ డాక్యుమెంట్లో పేర్కొన్నట్టు రీఫైనాన్స్లో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందా? లేదా? అని ప్రశ్నించగా… అలాంటి ఫీజు ఏమీ ఉండదని స్పష్టంచేశారు. అంటే కేవలం డాక్యుమెంట్ ఆధారమే కాదు, ఆ సంస్థ ప్రతినిధి సైతం ప్రాసెసింగ్ ఫీజేదీ లేదని కుండబద్ధలు కొట్టారు. మరి… సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన, రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించామంటున్న రూ.84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజు ఎక్కడికి పోయినట్టు?!
‘కిషన్‌రెడ్డి మే 20న కట్టర్‌ను 21న అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి రేవంత్‌రెడ్డికి తొందరగా పనులు చేస్తే తెలంగాణలో బీజేపీ ఉండాలా? మూసేయాలా? అని తిరకాసు పెట్టడంతో కేంద్రం లోన్ ఆపింది. అందుకే నేను కిషన్‌రెడ్డి వెంట పడుతున్న. మేం కంప్లీట్‌గా కార్పొరేట్ బిజినెస్ మోడ్‌లో లోన్ తెచ్చుకుంటే అడ్డుకున్నరు. ఈ రోజు కిషన్‌రెడ్డి లోన్ ఇప్పిస్తరా? లేదా? చెప్పాలి…’ అని రెండురోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇదే నిజమైతే, మే 20న కిషన్‌రెడ్డి అడ్డుకుంటే.. ఐదురోజుల తర్వాత మే 25వ తేదీన ఐఆర్ఎఫ్సీ ఒప్పందం ఎలా చేసుకున్నది?
ఐఆర్ఎఫ్సీ రుణం నిలిచిపోవడం వెనుక కారణాలపై మరో వాదన కూడా వినిపిస్తున్నది. తొలుత ఐఆర్ఎఫ్సీ కోరిన మేరకు వాయిదాల చెల్లింపుల విధానంపై తెలంగాణ ప్రభుత్వం టికెట్లు, ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెంటనే కిస్తు కింద ఐఆర్ఎఫ్సీకి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేసిందని అంటున్నారు. ఏ ప్రాజెక్టు అయినా ప్రథమంగా ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (ఓఅండ్ఎం)కు ప్రాధాన్యం ఇవ్వాలని, టికెట్లు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని కిస్తు కింద చెల్లిస్తే నిర్వహణ (ఓఅండ్ఎం) ఎలా? అని అభ్యంతర పెట్టిందని మరో వాదన. ఈ విధానాన్ని మార్చి లాభాల నుంచి కిస్తులు చెల్లిస్తామనే రీతిలో ప్రణాళిక ఇవ్వాలని చెప్పగా… అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించలేదని, అందుకే రుణం విడుదల ఆగిపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఐఆర్ఎఫ్సీ దాదాపు రూ.5 లక్షల కోట్ల వరకు రుణాలు ఇచ్చినా దాని ట్రాక్ రికార్డులో ఎక్కడా నాలుగు శాతం వడ్డీ లేదు. సరాసరి 8-8.5 శాతం వరకు ఉన్నది. మరి, మీడియా ముందు మాత్రం తాము కేవలం నాలుగు శాతానికే ఐఆర్ఎఫ్సీ రుణాన్ని ఒప్పందం చేసుకున్నామని సీఎం రేవంత్ ఎలా చెప్పగలిగారు?
నిజంగా ఐఆర్ఎఫ్సీ నుంచి నాలుగు శాతం వడ్డీకే రుణ ఒప్పందం జరిగి ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 24న జారీ చేసిన జీవోలో వడ్డీ రేటును ఎందుకు పొందుపర్చలేదు? పైగా గత నెల 25న ఢిల్లీలో ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఎక్కడా వడ్డీ రేటును అధికారులు ఎందుకు వెల్లడించలేదు? పత్రికాప్రకటనలోనూ పొందుపరచలేదేం? తక్కువ వడ్డీకి అని మాత్రమే చెప్పారు. మరి నాలుగు శాతం వడ్డీ అనే విషయాన్ని ముందుగా ఎందుకు చెప్పలేదు? ప్రక్రియ ముందుకు సాగకపోవడంలో వడ్డీ అంశమేమైనా పీటముడి వేసిందా?
కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలు, పాటించాల్సిన నిబంధలను పాటించనందునే ఐఆర్ఎఫ్సీ రుణం రాలేదని కిషన్‌రెడ్డి చెప్తున్నారు. అయితే ఏ సూచనలను పాటించలేదో, ఏ నిబంధనలను ఉల్లంఘించిందో అటు కేంద్రం, ఇటు రేవంత్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?
తెలంగాణ ప్రభుత్వానికి మెట్రో టేకోవర్ కోసం రూ.13,527 కోట్లు రీఫైనాన్స్ చేస్తున్నామని ఐఆర్ఎఫ్సీ అధికారికంగా స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం అందించిన తర్వాత కూడా నిధులు ఎందుకు విడుదల కాలేదు? తాము ప్రాసెసింగ్ ఫీజు చెల్లించామని, ఎల్అండ్టీకి ఈక్విటీ మొత్తాన్ని విడుదల చేశామని.. అయినా రుణం ఆగిపోయిందని చెప్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. దానిపై తేల్చుకునే ప్రయత్నం చేయకుండా రాజకీయ ఆరోపణల మాటున ఎందుకు దాక్కుంటున్నట్టు?
కేంద్రం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లిఖితపూర్వక హామీలతో ప్రక్రియ పూర్తయినా ఐఆర్ఎఫ్సీ రుణాన్ని విడుదల చేయకపోతే.. రాష్ట్రప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి కదా. కానీ ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడంలేదు? సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహించి రాజకీయ ఆరోపణలే ఎందుకు చేస్తున్నారు? ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అధికారికంగా ఒప్పందం ముగిసిన తర్వాత ఐఆర్ఎఫ్సీ వెనుకడుగు వేయడంపై ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తే నిధుల్ని విడుదల చేయించడమో, చర్యలు తీసుకోవడమో చేస్తుంది కదా… అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అనాలోచిత… ఆత్రుత… ఆర్భాటం… కలగలిసినన నిర్ణయమే ఇప్పుడు రేవంత్ సర్కార్‌ను మెట్రో పట్టాల్లో ఇరికించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వంద రూపాయల మెట్రోను బేరమాడి యాభై రూపాయలకే కొన్నానని, ఎల్అండ్టీ ఏటా రూ.400-500 కోట్ల నష్టాల్లో మెట్రోను నడిపితే.. తాను రూ.100-150 కోట్ల లాభాల్లోకి తీసుకువస్తానని రేవంత్ పదేపదే చేసిన ప్రకటనలు, అందుకు వంతపాడిన ప్రభుత్వ పెద్దలు, తలూపిన కాంగ్రెస్ నేతలను చూసి ఆదినుంచీ మేధావులు, నిపుణులు, విద్యావంతులు విస్మయంగానే విన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు! నాలుగు శాతం వడ్డీతో ఐఆర్ఎఫ్సీ రుణం తెస్తే లాభం వచ్చేదని, కానీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకోవడంతో రుణం ఆగిపోయిందని అంటున్నారు.
ఇక 8 నుంచి 11 శాతం వడ్డీకి బయటినుంచి రుణం తీసుకువచ్చి ఎల్అండ్టీ నుంచి మెట్రోను టేకోవర్ చేస్తామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్తున్నారు. అంటే.. మెట్రో పట్టాలపై పోతున్న ఎల్అండ్టీ నష్టాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. టేకోవర్ తంతుతో తెలంగాణ ప్రజల నెత్తిన మోపబోతున్నదన్నమాట. ఈ నేపథ్యంలో ఐఆర్ఎఫ్సీ రుణాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆపారన్న సీఎం రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా… అసలు ఎందుకు ఆగిపోయిందనే దానిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఆ మేరకు అనేక సందేహాలకు సమాధానం దొరుకాల్సి ఉన్నది.
రెండ్రోజుల క్రితం సచివాలయం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశం ఆద్యంతం.. హైదరాబాద్ మెట్రో మొదటి దశ టేకోవర్ కోసం ఒప్పందం చేసుకున్న ఐఆర్ఎఫ్సీ రీఫైనాన్స్ రూ.13,527 కోట్ల విడుదల ఆగిపోయిందన్న విషయం చుట్టూ, అందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కారణమన్న ఆరోపణల చుట్టూ తిరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేశారు. అసలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఐఆర్ఎఫ్సీ రుణం సాధిస్తే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆయన వెనుక కేటీఆర్ ఉండి కాళ్లల్లో కట్టె పెట్టారని చిర్రుబుర్రులాడారు. కానీ గత నెల 25న తెలంగాణ ప్రభుత్వం-ఐఆర్ఎఫ్సీ మధ్య రీఫైనాన్స్‌పై ఒప్పందం దరిమిలా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన అంశాలున్నాయి.
‘కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్, బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అమూల్యమైన, నిరంతర సహకారం, మార్గదర్శనం, ప్రోత్సాహాన్ని అందించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారం, సమర్థవంతమైన మార్గనిర్దేశానికి ప్రధాన కార్యదర్శి కృతజ్ఞతలు తెలియజేశారు’ అని ఉంది. మరి, కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని ముఖ్యమంత్రి చెప్తున్నదానికి అర్థమేమున్నది? నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్టు ఇదేం రాజకీయం? ఇంతకీ కిషన్‌రెడ్డి రీఫైనాన్స్ కోసం సహకరించారా? అడ్డుకున్నారా? ఒప్పందం వరకు సహకరించి, విడుదల ముందు అడ్డుకున్నారా? ఏది నిజం? ఎవరిది డ్రామా??
ఇది గత నెల 25న ఐఆర్ఎఫ్సీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలోని ఓ భాగం. దీన్నే స్టాక్ఎక్సేంజ్లకూ ఐఆర్ఎఫ్సీ పంపింది. ‘త్రైమాసిక పేమెంట్లతో 20 ఏండ్ల కాలానికి రుణాన్ని మంజూరు చేస్తున్నాం. అందుకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, కమిట్మెంట్ చార్జీలు, ప్రీపేమెంట్ పెనాల్టీలూ లేవు’ అంటూ రెండోపేజీలో స్పష్టంగా పేర్కొన్నది.

హైదరాబాద్ మెట్రో రీఫైనాన్స్ డీల్‌కు సంబంధించి ఐఆర్ఎఫ్సీ విడుదల చేసిన ప్రకటన.. ప్రాసెసింగ్ ఫీజ్ లేదంటూ ఆ పత్రాల్లో పేర్కొన్న ఐఆర్ఎఫ్సీ
జూన్ 1 నాటికి ఎల్అండ్టీ నుంచి మెట్రోను మేం టేకోవర్ చేయాలి. దానికి సంబంధించి అన్ని ఒప్పందాలను పూర్తి చేసుకున్నం. 1,400 కోట్లు మేం ఎల్అండ్టీకి మార్జిన్ మనీ కట్టాలి. రూ.13,600 కోట్లు ఐఆర్ఎఫ్సీ మాకు అప్పు ఇవ్వాలి. అదీ ఒప్పందం. అందుకోసం లోన్ ప్రాసెసింగ్‌కు రూ.84 కోట్లు చెల్లించినం. ఎల్ అండ్‌టీకి రూ.1400 కోట్లు మేం కట్టాల్సింది కట్టినం. కరెక్ట్‌గా ఈ టైమ్‌కు కిషన్‌రెడ్డి వెళ్లి 20 తారీఖు నాడు లావాదేవీలన్నీ ఆపేసిండు.
– సోమవారం సచివాలయంలో జరిగిన మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి