(స్పెషల్ టాస్క్బ్యూరో), హైదరాబాద్, జూలై 19 ( నమస్తే తెలంగాణ): గోపన్‌పల్లి భూముల వ్యవహారంలో రోజుకో కొత్త కథ వెలుగులోకి వస్తున్నది. రాష్ట్రంలో ఇతర భూములకు సంబంధించిన నిబంధనలు ఇక్కడ మాత్రం పనిచేయడం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా సర్వే నంబర్ 36లోకి ప్రవేశించిన ప్రైవేటు వ్యక్తులు ఫెన్సింగ్ పనులు చేస్తుంటే అధికార యంత్రాంగం కండ్లప్పగించి చూస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అనుగుణంగా రెవెన్యూ శాఖ అధికారికంగా చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గతంలో ప్రభుత్వం పీవోటీ కింద స్వాధీ నం చేసుకున్న లావుణి పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అయి తే, ఎందుకు తొలగిస్తున్నారనే కనీస సమాచారాన్ని అందులో పొందుపరచలేదు. ఈ మేర కు రిజిస్ట్రేషన్ శాఖకు పంపిన లేఖ బయటపడింది. దీన్ని ఆసరాగా చేసుకొని రిజిస్ట్రేషన్ శా ఖ తలుపులు బార్లా తెరిచింది.
ఒరిజినల్ డా క్యుమెంట్లు లేకున్నా అధికారులు పచ్చజెండా ఊపడం తో సదరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్ల జాతర కొనసాగిస్తున్నారు. అంటే ఈ డాక్యుమెంట్ల ఆధారంగా ఆ భూముల్లో రేపోమాపో నిర్మాణాలూ మొదలుపెడతారన్నమాట. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని ప్రభుత్వ ఉరఫ్ ప్రభుత్వ ఉద్యోగుల భూముల వెనక చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. నిన్న వట్టినాగులపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుండానే ప్లాట్లు చేతులు మారడం వెలుగులోకి వస్తే… తాజాగా ఆ భూములకు సంబంధించి నిషేధిత జాబితాలో తొలగించడానికి కారణమైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి లేఖ బయటికొచ్చింది. సర్వే నంబర్ 36లోని రెండు సబ్ డివిజన్లలో ఉన్న 22 ఎకరాల్లో 17.04 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీకి గత నెల 23న లేఖ (నం.ఇ1/202/ 2025) రాశారు. 36/ఆలో 12.20 ఎకరాలు ఉంటే అందులో 8.36 ఎకరాలు, 36/ఇలో పదెకరాలు ఉండగా అందులో నుంచి 8.08 ఎకరాలు అంటే మొత్తం 17.04 ఎకరాలను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని అందులో పేర్కొన్నారు. ఈ రెండు సబ్ డివిజన్ల సర్వే నంబర్లలోని 17.04 ఎకరాల్లో 5.16 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
ఈ లేఖ సూచనల్లో (రెఫరెన్స్) అదే నెల 11వ తేదీన రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం రాసిన లేఖతో పాటు 20వ తేదీన స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ రాసిన లేఖను ఉదహరించారు. దీంతో నిషేధిత జాబితాపై రిజిస్ట్రేషన్ శాఖ-కలెక్టర్ మధ్య లిఖితపూర్వకంగా సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తున్నది. కానీ వాటి వివరాలు బయటికి రావడం లేదు. దీంతో పాటు సర్వే నంబర్ 37లోని ఒక సబ్ డివిజన్లో కూడా ఐదెకరాల భూమిని నిషేధి త జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ లేఖ రాసినట్టుగా తెలుస్తున్నది. కానీ ఆ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. మరి, నిషేధిత జా బితా నుంచి తొలగించిన భూమి బసవతారకనగర్ ఉన్న స్థలమేనా? అనే సందేహం వ్యక్తమవుతున్నది.
రెండున్నర నెలల్లోనే తలకిందులు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన రిజిస్ట్రేషన్ శాఖకు జిల్లాలోని నిషేధిత భూముల జాబితా వివరాలను పంపారు. శాఖ కమిషనర్ వాటిని 15వ తేదీన అమలులోకి తీసుకువచ్చి శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయించారు.
ఎందుకీ గోప్యత?
గోపన్‌పల్లి భూములపై దాదాపు 10-15 రోజులుగా వివాదం రగులుతున్నది. తొలుత సర్వే నంబర్ 37లోని బసవతారకనగర్ బస్తీవాసులపై ప్రైవేటు వ్యక్తులు దౌర్జన్యం చేసి దాడులకు దిగారు. అప్పుడు రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు. ఆ తర్వాత సర్వే నంబర్ 36లో కంటెయినర్లు వేసి దర్జాగా పనులు చేపడుతున్నారు. దీంతో ఉద్యోగులు నాలుగు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. పైగా రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులకు ఒత్తాసు పలుకుతున్నారు. మరి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసినపుడు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లనైనా అధికారులు బహిర్గతం చేయడంలేదు. ముఖ్యంగా ఎవరూ కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకే ప్రభుత్వ పెద్దల సూచనలతో అధికారులు ఎన్వోసీలు, ఇతరత్రా డాక్యుమెంట్లపై గోప్యత పాటిస్తున్నారని తెలిసింది.