చిట్యాల, నవంబర్ 11 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి విహారి ట్రావెల్స్‌కు చెందిన బస్సు 29 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరుకు బయలుదేరింది. వెల్మినేడు శివారులోని బస్బే వద్దకు చేరుకోగానే ఇంజిన్‌లో పొగలు రావటంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే పక్కకు ఆపాడు. ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. క్షణాల్లో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రాణ నష్టం జరగనప్పటికీ వస్తువులు దగ్ధమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజిన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి, షార్ట్ సర్యూట్ కావడంతో ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నాగరాజు తెలిపారు.