గుడిహత్నూర్, ఏప్రిల్ 12 : దిగుబడి లేక.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక తీవ్ర మనస్తాపంతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలంలోని గురుజ గ్రామానికి చెందిన రైతు కుమ్ర గోవింద్ (32) రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, సోయా వేశాడు.
సాగు కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ ఏడాది దిగుబడి రాకపోవడం, వారం రోజుల క్రితం ఎద్దు చనిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి గ్రామ సమీపంలోని చేనులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.