ములుగురూరల్, జూన్ 26 : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంత్రి సీతక్క సొంత గ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో జరిగింది. మృతుడి సోదరుడు శంకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జెట్టి సమ్మయ్య (42) కౌలు రైతు. నిరుడు గ్రామంలో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని 2 ఎకరాల్లో మిర్చి, మరో 2 ఎకరాల్లో పత్తి వేశాడు. ఎకరానికి రూ.15 వేలు కౌలు కాగా, నాలుగు ఎకరాలకు రూ.60 వేలతోపాటు పెట్టుబడి ఖర్చులు, కూలీల ఖర్చుకు కూడా పంట దిగుబడి రాలేదు. దీంతో సమ్మయ్య అప్పుల పాలయ్యాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉండగా, రెండేండ్ల క్రితం పెద్ద కూతురి పెండ్లి చేశాడు.
మొత్తం సుమారు రూ.8 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాది మూడు ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. విత్తనాల తీసుకొచ్చేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పు కూడా పుట్టలేదు. దీంతోపాటు గతంలో పంట పెట్టుబడి, కుమార్తె పెండ్లి అప్పులతో మనస్తాపం చెందిన సమ్మయ్య ఈనెల 5న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రైతు కుటుంబాన్ని ఆదునేందుకు సీతక్క చొ రవ చూపాలని పలువురు కోరుతున్నారు.