హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : మొంథా తుపాను బీభత్సం నుంచి బయట పడకముందే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. ఈనెల 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నది. అండమాన్ సమీప ప్రాంతాల్లో ఈ అల్పపీడనం రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తున్నట్టు వెల్లడించింది.
ఈ అల్పపీడనం బలపడితే మరోసారి భారీ వర్షాలు, ఈదురుగాలులు తెలుగు రాష్ర్టాలను వణికిస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా, రానున్న మూడ్రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. శుక్రవారం ఉదయం వాయవ్య ఝార్కండ్ దాని సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని .. రానున్న 12గంటల్లో ఉత్తర వాయవ్య దిశలో కదులుతూ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు తెలిపింది.