హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బీఆర్ఎస్ నేతలు సంధించే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేకపోతున్నది. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిగ్గదీయడాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు తట్టుకోలేకపోతున్నది. అప్రజాస్వామిక, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. ఎలాగైనా ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. గట్టిగా ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసుల కత్తి వేలాడదీస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు లక్ష్యంగా అక్రమ కేసులకు తెరలేపారు. కేటీఆర్‌పై ఇప్పటికే పదికిపైగా కేసులు పెట్టిన ప్రభుత్వం.. తాజాగా హరీశ్‌రావుపై మరో కేసు పెట్టింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
ఏడాదిలోనే 6 అక్రమ కేసులు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే హరీశ్‌రావుపై 6 కేసులు పెట్టారు. 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని నిలదీసినందుకు ఓ కేసు, రూ.2 లక్షల రుణమాఫీని అందరికీ వర్తింపజేయడం లేదని విమర్శించినందుకు ఓ కేసు, సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అన్నందుకు, రుణమాఫీ చేయకుండా రైతులను మోసగించిన రేవంత్‌రెడ్డి పాపం రాష్ట్ర ప్రజలకు శాపం కాకూడదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాపపరిహార పూజలు చేసినందుకు, ఎస్ఎల్బీసీలో చికుకున్న 8 మంది ప్రాణాలు కాపాడటంలో రేవంత్ సరారు విఫలమైందని విమర్శించినందుకు, 14 నెలల కాంగ్రెస్ పాలనలో 4 ప్రాజెక్టులు కుప్పకూలాయని చెప్పినందుకు 5 కేసులు నమోదు చేసిన ప్రభుత్వం.. హరీశ్‌రావు అనుచరులు తనను బెదిరిస్తున్నారని చక్రధర్‌గౌడ్ అనే కాంగ్రెస్ నాయకుడితో ఫిర్యాదు చేయించి ఫిబ్రవరి 27న బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మరో అక్రమ కేసు బనాయించింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు పెట్టిస్తవ్ రేవంత్‌రెడ్డి? అని నిలదీస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తూనే ఉంటామని, ప్రజా సమస్యల పరిషారం కోసం నిబద్ధతతో, నిజాయితీగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని, ఇందిరమ్మ రాజ్యం అంటూ రేవంత్‌రెడ్డి చీకటి రాజ్యం కొనసాగిస్తున్నారని, ఎమర్జెన్సీ పాలన తలపిస్తున్నారని మండిపడుతున్నారు.
ప్రశ్నిస్తున్నందుకే హరీశ్‌రావుపై అక్రమ కేసులు ; ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): నిత్యం ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టిన ముఖ్యమంత్రిని ఎగవేతల రేవంత్‌రెడ్డి అన్నందుకు, రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై సీఎం ఒట్టేసి మాటతప్పడం రాష్ట్ర ప్రజలకు శాపం కావొద్దని యాదాద్రిలో పూజలు చేసినందుకు, ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు హరీశ్‌రావుపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు.