వెల్దుర్తి, జూన్ 10: పంట దిగుబడి రాక, అప్పుల భారం మోయలేక ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. వెల్దుర్తి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలుకపల్లికి చెందిన రైతు మంద స్వామి(41)కి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తె పెండ్లి మాత్రమే చేశాడు. తనకున్న 20 గుంటల పొలంతోపాటు రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని కొన్నేండ్లుగా సాగుచేస్తున్నాడు.
ఆశించిన మేర దిగుబడులు రాకపోవడంతోపాటు రూ.10 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. వీటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురైన స్వామి మంగళవారం ఉదయం గ్రామశివారులోని కాన్చెరువు సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్వామి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.