Bus Accident | పటాన్ చెరు, నవంబర్ 5: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కారును తప్పించబోయి ఓ బస్సు అదుపుతప్పి డివైడర్ ఎక్కి, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ శివారు పటాన్చెరు సమీపంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ నుంచి ఇస్నాపూర్‌కు బుధవారం ఉదయం బయల్దేరింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో 65వ జాతీయ రహదారిపై గల ఓ హోటల్ ముందు కార్లు ఎక్కువగా నిలవడంతో ఓ కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ ఎక్కింది. ఈ క్రమంలో డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ స్తంభాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్సు అక్కడే ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో డ్యామేజ్ అయిన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తీశారు.
కాగా, ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు యథేచ్చగా పార్కింగ్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీని కారణంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా హైవేపై వాహనాలు నిలపకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.