ఇల్లెందు, జనవరి 19: ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏండ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్‌లో కొత్త ఆటో కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో రోడ్డున పడ్డ ఎందరో ఆటో డ్రైవర్లలో ఈ యువకుడు కూడా ఉన్నాడు. ఆటోను కొత్తగా కొనుగోలు చేసినప్పటికీ మహిళలెవరూ పెద్దగా ఆటో ఎక్కకపోవడం, ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.12 వేలు ఇవ్వకపోవడం, రోజువారీ ఆదాయం కూడా సరిగా రాకపోవడం, కిస్తీలు కట్టేంత కిరాయిలు లభించకపోవడం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషాదకర ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. ఇల్లెందు పట్టణానికి చెందిన రెడ్డబోయిన సుమంత్ (36) 15 ఏండ్లుగా అద్దె ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఏడాది క్రితం ఫైనాన్స్‌లో కొత్త ఆటో కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. కోటి ఆశలతో కొత్త ఆటో కొనుగోలు చేసిన సుమంత్‌కు కష్టాలు మొదలయ్యాయి. గిరాకీ లేకపోవడంతో కిస్తీలు కట్టేందుకు అప్పుడు చేసేవాడు.కుటుంబ పోషణకూ మరికొంత అప్పు చేశాడు. ఇలా మొత్తం రూ.6 లక్షల అప్పు అయ్యింది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ అమలు కాలేదు. అప్పులు తీర్చే మార్గం లేక ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమంత్‌కు భార్య నాగమణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.