Free Power | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విద్యాసంస్థలకు సర్కారు ఇస్తామన్న ఉచిత విద్యుత్తు కొన్నింటికేనా? అన్నింటికి కాదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు సదుపాయం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రకటించారు. 27,862 విద్యాసంస్థలకు ఈ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలను కలుపుకుంటే 30 వేలకు పైగా ఉన్నాయి. వీటికి హాస్టళ్లు అదనం. దీన్నిబట్టి అన్నింటికీ ఈ సదుపాయం వర్తించనట్టే.
ఉచిత విద్యుత్తు ప్రకటనతో విద్యాసంస్థల్లో సోలార్ ప్లాంట్ల అంశం అటకెక్కినట్టేనన్న వాదన తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 11 జిల్లాల్లోని 1,521 సర్కారు బడుల్లో సోలార్ ప్లాంట్లను నెలకొల్పారు. మరో 6,490 స్కూళ్లల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పా టు చేయాలని గతంలోనే విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలతోపాటు, తెలంగాణ మాడల్ స్కూల్స్, కేజీబీవీలోను కొత్తగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికోసం రూ.289 కోట్లు వెచ్చించనుండగా, టీజీ రెడ్కోకు సంస్థలను ఎంపిక చేసే బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు సర్కారు ఉచిత విద్యుత్తును ప్రకటించడంతో ఈ సోలార్ ప్లాంట్ల కథ కంచికి చేరినట్టేనని భావిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): ఆర్అండ్బీ శాఖలో కొంతకాలంగా క్లర్క్ ఉద్యోగాలతోపాటు డేటా ఎంట్రీ, సబార్డినేట్, డ్రైవర్ తదితర ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో అవసరాలకు అనుగుణంగా సుమారు 100 మందికిపైగా సిబ్బందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. అయితే, మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఆఫీసుకు వచ్చేందుకు బస్‌పాస్‌లకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు తమ గోడును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లీజు కార్లకు సంబంధించి ప్రతి నెలా ఒక్కో కారుకు రూ. 35వేల వరకు అద్దె చెల్లిస్తారు. ఇందులోనే డీజిల్ ఖర్చుతోపాటు డ్రైవర్ వేతనం కూడా ఉంటుంది. మూడు నెలలుగా లీజు తాలూకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులుచేసి డీజిల్ కొంటున్నట్టు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేయాలని వేడుకుంటున్నారు.