హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా? అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గట్టు రామచందర్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈనెల 11న ఫూలే జయంతి ఉందని.. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన దీక్ష జయప్రదం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి బ్యాచ్‌కి కళ్లు కుట్టాయని ఆయన విమర్శించారు. ఇందిరాపార్కు వద్ద దీక్ష స్థలాన్ని కొందరు పినాయిల్‌తో కడిగారని.. అలా చేయడం ఫూలేను అవమానించడమే అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫూలేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి సెక్యూరిటీలు లేకుండా గ్రామాలకు వెళితే.. ప్రజలు నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీసీలను మోసం చేయటానికే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి దొంగ దీక్షలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. ఫూలే విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రాఆనంద్, జాగృతి నాయకులు ఆలకుంట హరి, నరేశ్ పాల్గొన్నారు.