హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్నారని, ప్రస్తుతం ఉన్న సిబ్బందిని ఇతర విభాగాలకు మళ్లిస్తున్నారని ఆయా విభాగాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీజీపీసీబీ పరిధిలోని రీజినల్, జోనల్ కార్యాలయాల్లో సిబ్బంది నియామకాలపై గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) జారీచేసిన ఇండికేటివ్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను తొలగించి వారి స్థానంలో ఇంజినీరింగ్ సిబ్బందిని నియమించుకునేందుకు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీజీపీసీబీ పరిధిలో కేంద్ర కార్యాలయంతోపాటు 10 రీజినల్, 2 జోనల్ ఆఫీసులు ఉన్నాయి. వీటి అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ విభాగంలో 20 జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా 4 రీజినల్ ఆఫీసులు, 2 జోనల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని టీజీపీసీబీ నిర్ణయించింది. మొత్తం 42 పోస్టులు అవసరం.
కానీ, ప్రస్తుతమున్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్, స్టెనో/టైపిస్ట్, స్పెషల్ క్యాటగిరీ స్టెనో లాంటి 20 పోస్టుల్లో ఉన్నతాధికారులు 9 పోస్టులను కన్వర్వ్ చేసి, కొత్తగా 6 జూనియర్ అసెస్టెంట్ పోస్టులను ప్రతిపాదించారు. దీంతో పోస్టుల సంఖ్య 17కి తగ్గింది. రీజినల్ ఆఫీసుల సంఖ్య 14కు, జోనల్ ఆఫీసుల సంఖ్య 4కు పెరుగుతుంటే ఆ స్థాయిలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు పెరగాల్సింది పోయి తగ్గిపోతుండటం గమనార్హం. ఉమ్మడి ఏపీలో 200 అదనపు పోస్టులు కావాలని 2008లో ప్రతిపాదించగా 2011లో తొలి విడతగా ఇంజినీరింగ్, సైంటిఫిక్ విభాగాలకు 90 పోస్టులు ఇచ్చినా అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడే వాటితో కలిపి 19 కార్యాలయాలు అవుతుండగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 17 అవుతున్నాయి. 19 కార్యాలయాలకు 52 జేఏ పోస్టులు అవసరం కానీ, ఉన్న పోస్టులను ఇంజినీరింగ్, సైంటిఫిక్ విభాగాలకు మళ్లించి అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ విభాగాలకు అన్యాయం చేస్తున్నారు. కొత్తగా ప్రతిపాదించిన రెండు జోనల్ ఆఫీస్‌లకు 2 అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పోస్టులు అవసరం కాగా ఒకటి మాత్రమే ప్రతిపాదించడం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సీపీసీబీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కమిటీని వేసి అశాస్త్రీయంగా ప్రతిపాదించిన 42 పోస్టులను నిలిపివేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.